Minister Taneti Vanitha : ఏపీలో రూ.9251 కోట్ల విలువైన గంజాయిని ధ్వంసం చేశామని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న చింతన్ శిబిర్ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు తెలిపారు. హరియాణా లోని సూరజ్ ఖండ్ లో రెండు రోజుల పాటు చింతన్ శిబిర్ కార్యక్రమంలో పాల్గొంటునట్లు హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. దేశం లోని ఇతర రాష్ట్రాల హోంమంత్రులు, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు చింతన్ శిబిర్ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో సైబర్ క్రైమ్, కోస్టల్ సెక్యూరిటీ, ఉమెన్ సేప్టీ, గంజాయి, డ్రగ్ కంట్రోల్, శాంతి భద్రతలు వంటి అంశాలపై చర్చ ఉంటుందని మంత్రి వెల్లడించారు.
311 ఏజెన్సీ గ్రామాల్లో గంజాయి సాగు
అక్రమ మాదక ద్రవ్యాల నిరోధానికి ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తానేటి స్పష్టం చేశారు. గంజాయి సాగుపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందన్నారు. ఆంద్రప్రదేశ్ ఒడిశా సరిహద్దుల్లో గంజాయిని పండించి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే విధానానికి అడ్డుకట్ట వేశామన్నారు. ఆపరేషన్ పరివర్తన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని హోంమంత్రి తెలిపారు. దాదాపు 311 ఏజెన్సీ గ్రామాల్లో గంజాయి సాగవుతున్నట్లు గుర్తించామన్నారు. ఆపరేషన్ పరివర్తన్ లో భాగంగా 9251 కోట్ల విలువ చేసే గంజాయిని నాశనం చేశామని గుర్తుచేశారు. గంజాయిని నిలువరించడంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. దేశంలోని 12 రాష్ట్రాల్లో గంజాయి సాగవుతుంటే ఏపీలోని 11,550 ఎకరాల గంజాయి అంటే దాదాపు 45 శాతం పంటను నాశనం చేసినట్లు తెలిపారు. ఇతర ప్రాంతాలకు రవాణా అవుతున్న గంజాయి పౌడర్ ను పట్టుకుని ధ్వంసం చేసినట్లు హోంమంత్రి తెలిపారు. గంజాయి పంట సాగు చేయకుండా అవగాహన కార్యక్రమాలు, ప్రత్యామ్నాయ పంటలు పండించడానికి ఏపీ ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. ఇప్పటి వరకు గంజాయి కేసుల్లో 11,100 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గంజాయి మత్తు పదార్ధాలపై యువతకు అవగాహన కార్యక్రమాల నిర్వహించినట్లు తానేటి వనిత పేర్కొన్నారు.
మహిళల భద్రతకు పెద్దపీట
ఆంధ్రప్రదేశ్ లో మహిళల భద్రతకు సీఎం జగన్ పెద్దపీట వేశారని తానేటి వనిత స్పష్టంచేశారు. మహిళల రక్షణ, భద్రత కోసం దిశ యాప్, ఏపీ పోలీస్ సేవా యాప్, మహిళా మిత్ర, సైబర్ మిత్ర, హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసినట్లు హోంమంత్రి తెలిపారు. దాదాపు ఒక కోటి 40 లక్షలకు పైగా ప్రజలు దిశ యాప్ ను డౌన్లోడ్ చేసినట్లు తెలిపారు. ఆపద సమయాల్లో ఉన్న మహిళలు దిశ యాప్ ను ఉపయోగించి రక్షణ పొందుతున్నారని స్పష్టంచేశారు. లైంగిక దాడి బాధితులకు త్వరితగతిన విచారణ నిర్వహించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
రైతులు కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారులు
ఏపీ పోలీస్ శాఖ పారదర్శకంగా, పూర్తి స్వేచ్ఛ గా పనిచేసే అవకాశాలను సీఎం జగన్ మోహన్ రెడ్డి కల్పించారని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. తప్పు చేసిన వారు ఎంతటివారైనా చట్ట ప్రకారం శిక్షించాలని సీఎం జగన్ పోలీసులకు సూచించారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది కాబట్టే వైస్సార్సీపీ పై ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్ పై టీడీపీ పదేపదే అసత్య ఆరోపణలు చేయడం తగదని మంత్రి తానేటి వనిత మండిపడ్డారు. అమరావతి పాదయాత్ర చేస్తున్న వారు రైతులు కాదని, రియల్ ఎస్టేట్ వ్యాపారులని ఆరోపించారు. పాదయాత్ర చేస్తున్న వారు పోలీసులను రెచ్చగొట్టినప్పటికీ సమన్వయంతో సహకరించారని తెలిపారు. పోలీసుల భద్రత లేకుంటే జిల్లాల్లో పాదయాత్ర ఎలా చేశారని ప్రశించారు. రాజధాని ప్రాంతంలో భూమి కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాదయాత్ర ముసుగులో రైతులను అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలని హోంమంత్రి తానేటి వనిత స్పష్టంచేశారు.