Floods In Vijayawada: విజయవాడలో (Vijayawada) వరదలతో ఎటు చూసిన హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలు ఇప్పుడిప్పుడే ముంపు నుంచి బయటపడుతున్నాయి. అటు, చిట్టినగర్ (Chitti Nagar) పరిధిలో ఓ 14 ఏళ్ల బాలుడి మృతదేహాన్ని నడుము లోతు నీటిలో తరలించడం ఆందోళన కలిగించింది. అదృశ్యమైన బాలుడు వరదల్లో విగతజీవిగా మారాడు. బాలుని మృతదేహాన్ని తరలిస్తోన్న సమయంలో ఆ తల్లి గుండెలవిసేలా రోదించిన దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టించాయి. అటు, వరద ప్రభావిత ప్రాంతాల్లో సర్వం కోల్పోయి కొందరు పూర్తిగా నిరాశ్రయులయ్యారు. ఎలక్ట్రిక్ వస్తువులు, ఇంటి సామగ్రి పూర్తిగా ధ్వంసమయ్యాయని.. చాలా వరకూ ఫైనాన్స్ మీద తెచ్చుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ జీరో నుంచే ప్రారంభమయ్యాయని వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
మరోవైపు, వరద నుంచి బయటపడిన ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త కుదుటపడుతోంది. అలాంటి చోట్ల అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల ద్వారా బురదను తొలగిస్తున్నారు. రోడ్లు, ఇళ్లు, షాపుల్లో బురదను తొలగిస్తున్నారు. దాదాపు 113 ఫైరింజన్లు నగరానికి చేరుకోగా.. 50 ఫైరింజన్ల ద్వారా సిబ్బంది శుభ్రత పనుల్లో నిమగ్నమయ్యారు. మొత్తం 32 డివిజన్లలో పలు ప్రాంతాలు ముంపునకు గురైనట్లు అధికారులు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎటు చూసినా అపరిశుభ్రంగా మారింది. కొన్ని చోట్ల టన్నుల కొద్దీ వాడేసిన వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ బ్యాగులు చెట్ల కొమ్మల మధ్య ఇరుక్కుపోయాయి. సిబ్బంది వీటిని తొలగించేందుకు యత్నిస్తున్నారు.
మళ్లీ వర్షం
అటు, విజయవాడలో మళ్లీ వర్షం ప్రారంభం కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఇంకా జక్కంపూడి వైఎస్సార్ కాలనీ, అంబాపురం, సింగ్ నగర్ ప్రాంతాల్లో వరద నీరు నిలిచి ఉంది. వర్షం పడుతున్నా సహాయక చర్యలకు ఆటంకం కలగకూడదని.. పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఆహారం, తాగునీరు సరఫరా చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అటు, బుడమేరుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, వరద తగ్గిన ప్రాంతాల్లో అపరిశుభ్ర వాతావరణం కారణంగా వ్యాధులు ప్రబలకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మందులు అందిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతం అజిత్ సింగ్ నగర్‌లో ఆర్టీసీ ఉచిత బస్సులు అందుబాటులో ఉంచారు.
విజయవాడలో అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. వివిధ జిల్లాల నుంచి పారిశుద్ధ్య సిబ్బందిని రప్పించిన అధికారులు రోడ్లు, కాల్వల్లోని మట్టి, ఇసుక మేటలు, చెత్తా చెదారాన్ని తొలగిస్తున్నారు. చెత్త తొలగించి దుర్వాసన రాకుండా బ్లీచింగ్ ఫౌడర్ చల్లారు. అధికారులు సెలవులు సైతం తీసుకోకుండా సాయం కొనసాగిస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రత్యేక అధికారుల నియామకంతో అక్కడ సహాయం వేగంగా అందుతోంది. సాయం అందించేందుకు ఇతర జిల్లాల నుంచి కూడా ఎమ్మెల్యేలు, కార్యకర్తలు తరలివస్తున్నారు. మరోవైపు, ఇంటింటికీ రేషన్ సరుకుల పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బాధితులకు 25 కేజీల బియ్యం, కందిపప్పు, వంటనూనె, చక్కెర, కూరగాయలతో కలిపి ఓ కిట్‌ను అందించనున్నారు.