CM Jagan Meets Tech Mahindra CEO Gurnani : దావోస్ పర్యటనలో ఉన్న సీఎం జగన్  ఏపీ పెవిలియన్‌లో టెక్‌ మహీంద్రా సీఈఓ, ఎండీ సీపీ గుర్నానితో సోమవారం భేటీ అయ్యారు. సీఎం జగన్ తో సమావేశం అనంతరం టెక్ మహీంద్రా ఎండీ, సీఈఓ సీపీ గుర్నాని మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ తో మంచి సమావేశం జరిగిందన్నారు. విశాఖపట్నాన్ని మేజర్‌ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పంతో ఉన్నారన్నారు. నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరారని చెప్పారు. ఆర్టిఫియల్‌ ఇంలెటిజెన్స్‌కు ప్రధాన కేంద్రంగా ఆయన విశాఖపట్నాన్ని తీర్చిద్దాలని సంకల్పంతో ఉన్నారని గుర్నాని తెలిపారు. ఈ కల సాకారానికి ఏపీతో కలిసి రావాలని ఆహ్వానించారని పేర్కొన్నారు. సీఎం జగన్ విజ్ఞప్తి మేరకు ఆంధ్ర యూనివర్శిటీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామన్నారు. నైపుణ్యాలను పెంచేందుకు, హైఎండ్‌ టెక్నాలజీపై వచ్చే మూడు నెలల్లో యూనివర్శిటీతో కలిసి ప్రత్యేక పాఠ్యప్రణాళికను రూపొందిస్తామని గుర్నాని తెలిపారు. 



ఫ్యూచర్‌ ఫ్రూఫింగ్‌ హెల్త్‌ సిస్టమ్స్‌ పై పబ్లిక్‌ సెషన్‌ లో సీఎం జగన్ 


అంతకు ముందు వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో ఫ్యూచర్‌ ఫ్రూఫింగ్‌ హెల్త్‌ సిస్టమ్స్‌ పై పబ్లిక్‌ సెషన్‌ లో సీఎం జగన్ పాల్గొన్నారు. కోవిడ్‌ లాంటి విపత్తును ఎవ్వరు కూడా ఊహించలేదని సీఎం అన్నారు. మన తరంలో కనీసం ఎప్పుడూ చూడని విపత్తు అన్నారు. వైద్య రంగంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కోవిడ్‌ లాంటి విపత్తు మరోసారి వస్తే దాన్ని నివారించడానికి బలమైన వ్యవస్థ కావాలని సూచించారు. కోవిడ్‌ విపత్తు నుంచి చాలా పాఠాలు నేర్చుకోవాల్సి ఉందని సీఎం జగన్ తెలిపారు. నివారణ, నియంత్రణ చికిత్స విధానాల ప్రాముఖ్యతను తెలుసుకోవాలన్నారు. మరోవైపు సమగ్రమైన ఆరోగ్య వ్యవస్థ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలన్నారు. అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. 


ఏపీలో కోవిడ్ మరణాల రేటు దేశంలోనే కనిష్టం


"కోవిడ్, తదనంతర అంశాలన్నీ మనకు కనువిప్పులాంటివి. ఒక దేశం, ఒక రాష్ట్రం పరిధిలో ఎంతవరకు చేయగలమో అంతా చేశాం. కోవిడ్‌ సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్‌పై దృష్టి పెట్టింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే అత్యాధునిక మల్టీస్పెషాలిటీ వైద్య సేవలు విషయంలో వెనుకబడి ఉంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడమే దీనికి ప్రధాన కారణం. బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌ లాంటి టయర్‌ –1 నగరాలు ఏపీలో లేనందున ప్రైవేటు సెక్టార్‌లో ఆత్యాధునిక  వైద్యసేవల లభ్యత తక్కువగా ఉంది. కోవిడ్‌ సమయంలో ప్రధానమైన ఈ లోపాన్ని మేము ముందే గుర్తించాం. కోవిడ్‌ నియంత్రణలో భాగంగా 44 దఫాలుగా ఇంటింటికీ సర్వే నిర్వహించాం. ఏపీలో దీనికోసం బలమైన వ్యవస్థను రూపొందించాం. ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయం,  ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌తో పాటు 42 వేల మంది ఆశావర్కర్లు కూడా వైద్య, ఆరోగ్యరంగంలో చురుగ్గా పనిచేస్తున్నారు. వీరందరిని సమిష్టి కృషితో ఇంటింటికీ సర్వే చేస్తూ తగిన చర్యలు తీసుకుంటూ కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం. ఫలితంగా మరణాల రేటును కూడా తగ్గించగలిగాం. ఇండియాలో నమోదైన సగటు మరణాల శాతం 1.21  ఉంటే ఏపీలో దేశంలోనే అత్యల్పంగా 0.63 శాతం నమోదైంది." అని సీఎం జగన్ అన్నారు.  


విలేజ్ క్లినిక్స్ 


కోవిడ్‌ లాంటి పాండమిక్‌లు సంభవించినప్పుడు ప్రభుత్వాలు ప్రధానంగా రెండు అంశాలపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ అన్నారు. ఒకటి నివారణ, రెండోది నియంత్రణ చికిత్స చెప్పారు. వైద్య, ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేయాలంటే అవైలబులిటీ, యాక్సెస్‌బులిటీ, ఎఫర్ట్‌బులిటీ ఈ మూడు సమాంతరంగా అందుబాటులోకి రావాలని సీఎం జగన్ వెల్లడించారు. ఇందులో భాగంగానే ఏపీలో 2 వేల జనాభా ఉన్న ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని విలేజ్‌ క్లినిక్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి 30 వేల జనాభా ఉన్న మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని 2 ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఒక్కో పీహెచ్‌సీకి ఇద్దరు చొప్పున నలుగురు వైద్యులు ఉంటారని చెప్పారు. ప్రతి వైద్యుడికి 104 వాహనాన్ని కేటాయిస్తారన్నారు. ఒక్కో వైద్యుడికి మండలంలో 4–5 గ్రామాలను కేటాయిస్తామని తెలిపారు. వీళ్లు రోజు తప్పించి రోజు గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు అందిస్తారని, ఆ గ్రామాల్లో ప్రజలకు ఫ్యామిలీ డాక్టర్లుగా సేవలు అందిస్తారన్నారు. తద్వారా ఆ గ్రామాల్లో ప్రజలను పేరు, పేరునా పలకరిస్తూ వారికి సేవలు అందించడంతో పాటు విలేజ్‌ క్లినిక్‌ను మెడికల్‌ హబ్‌గా ఉపయోగిస్తారన్నారు. ఇందులో ఏఎన్‌యమ్, నర్సింగ్‌ గ్రాడ్యుయేట్, మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రాక్టీస్‌నర్‌, ఆశా వర్కర్లు ఉంటారన్నారు. వీళ్లంతా నివారణ చర్యల్లో చురుగ్గా పాల్గొంటారని సీఎం జగన్ తెలిపారు.