Dana Cyclone Towards Reached Odisha Coast: వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారిన 'దానా' (Dana Cyclone) ఒడిశా తీరం వైపు దూసుకొస్తోంది. పారాదీప్‍‌కు (ఒడిశా) 180 కిలోమీటర్ల దూరంలో, ధమ్రాకు (ఒడిశా) 210 కిలోమీటర్ల దూరంలో, సాగర్ ద్వీపానికి (బెంగాల్) 270 కి.మీ దూరంలో తీవ్ర తుపాను కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను ఉత్తర వాయువ్య దిశగా గంటకు 12 కి.మీ వేగంతో కదులుతున్నట్లు తెలిపింది. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయంలోపు తీరం దాటే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. పూరీ - సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 'దానా' ప్రభావంతో ఇప్పటికే ఏపీలోని కొన్ని జిల్లాలు సహా ఒడిశా, పశ్చిమబెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బీచ్‌లను మూసేసిన అధికారులు.. అటు వైపు ఎవరూ రాకుండా చర్యలు చేపట్టారు. తుపాను తీరం దాటే సమయంలో అలర్ట్‌గా ఉండాలని.. 120 కిలోమీటర్ల వేగంతో గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.


ఏపీలో వర్షాలు


'దానా' తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడతున్నాయి. గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 


మరోవైపు, తెలంగాణలో తుపాను ప్రభావం అంతగా లేకపోయినా... కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.


ఈ రైళ్లు రద్దు


తుపాను ప్రభావంతో పలు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం బ్రహ్మపూర్- సూరత్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (రైలు నెం - 09060), దీఘా- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (22873), భువనేశ్వర్- విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (22819), బ్రహ్మపూర్- విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ (08531), గుణుపూర్- విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ (08521), బ్రహ్మపూర్- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (18525), గుణుపూర్ - కటక్ ఎక్స్‌ప్రెస్ (08422), విశాఖపట్నం- అమృత్‌సర్ హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ (20807), గన్‌పూర్ - పూరి ఎక్స్‌ప్రెస్ (18418), విశాఖ - గుణుపూర్ ప్యాసింజర్ స్పెషల్ (08522), పూరి- గుణుపూర్ ఎక్స్‌ప్రెస్ (18417) రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.


Also Read: Andhra News: ఏపీలో హృదయ విదారక ఘటనలు - తండ్రి కన్నుమూసిన గంటకు బిడ్డకు జననం, మరోచోట కన్నబిడ్డనే అమ్మేసిన కన్నతల్లి