Weather Updates: ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత తగ్గడం లేదు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలే అందుకు కారణమని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో వాయువ్య దిశ నుంచి గాలులు ఆగిపోగా.. తాజాగా నైరుతి దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలో మరో రెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. అయితే వాతావరణ శాఖ ఎలాంటి అలర్ట్ జారీ చేయలేదు. తమిళనాడు, పుదుచ్చేరిలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. 


కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో నేడు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. రేపు సైతం  తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల కురుస్తాయి. మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఎలాంటి సమస్య లేదని అధికారులు సూచించారు. ఏపీలో ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత వర్షాల కారణంగా పెరిగింది. అత్యల్పంగా జంగమేశ్వరపురంలో 18.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కళింగపట్నంలో 19.4 డిగ్రీలు, విశాఖపట్నంలో 20 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తగ్గలేదు కానీ వర్షాల కారణంగా చలి గాలులు వీస్తున్నాయి.  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, యానాం, (పుదుచ్చేరి)లలో నేడు వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోనూ ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి రెండు రోజులపాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల పడతాయని అంచనా వేశారు. కోస్తాంధ్ర ప్రాంతంతో పోల్చితే రాయలసీమలో చలి తీవ్రత అధికంగా ఉంది. ఆరోగ్యవరంలో 16.5 డిగ్రీలు, అనంతపురంలో 16.8 డిగ్రీలు,  కర్నూలులో 18.7 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 


తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో వాతావరణం సాధారణంగా, పొడిగా ఉంటుంది. తెలంగాణకు ఎలాంటి వర్ష సూచన లేదని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఆకాశం నిర్మలమై కనిపిస్తుంది. ఉదయం వేళలో కొన్ని జిల్లాల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. నైరుతి దిశ నుంచి గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలు ఉండగా, గరిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి.


Also Read: Saidabad: పోలీసులు చేతులెత్తేసిన కేసును ఛేదించిన సామాన్యుడు... భార్యను వెతికిపట్టుకున్న భర్త...


 Also Read: Mulugu District: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే బాలికలకు ఈ సౌకర్యం.. మంత్రి సత్యవతి రాథోడ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి