BJP Leader Purandeswari: పాలకొల్లు: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు నిధులు మంజూరు చేసిందని, దేశం లో సుపరిపాలన అందించగలిగే పార్టీ బిజెపి అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandeswari) అన్నారు. జిల్లాలో జాతీయ రహదారులు రైల్వే లైన్ అభివృద్ధి వశిష్ట బ్రిడ్జి నిర్మాణానికి వేల కోట్లు కేంద్రం మంజూరు చేసింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా నిధులు మంజూరు చేయకపోవడంతో కొన్ని పనులు నిలిచిపోయాయని చెప్పారు. పాలకొల్లులో జరిగిన కార్యక్రమంలో దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. మడం తిప్పం మాట తప్పం అని చెప్పిన వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాంతాలు కులాల మధ్య విభేదాలు సృష్టిస్తుందని ఆరోపించారు. ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారు. ఆడుకుందాం ఆంధ్రా పథకం పెట్టి రాష్ట్రంతో వైసీపి ప్రభుత్వం ఆడుకుంటుందని ఎద్దేవా చేశారు.


గోదావరి జోన్ పర్యటనలో భాగంగా పాలకొల్లుకు వచ్చినట్లు తెలిపారు. కార్యకర్తల మనోభావాలు తెలుసుకోవడంతో పాటు సంస్థాగతంగా పార్టీ పటిష్టతపై ఫోకస్ చేస్తామని పేర్కొన్నారు. స్థానికంగా రాజకీయ కార్యాచరణ రూపొందించి ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. ఏపీకి కేంద్రం ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది, ప్రధాని నరేంద్ర మోడీ సహాకారంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు. 


పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 216 జాతీయ రహదారి 316 కోట్లతో నిర్మాణం జరుగుతోంది. వశిష్ట నదిపై వంతెన, బైపాస్ ఏర్పాటు. 165 నెంబర్ జాతీయ రహదారి నిర్మాణానికి భూసేకరణ చేశామన్నారు. దాంతో పాటు నరసాపురం, భీమవరం రైల్వే స్టేషన్ మౌలిక సదుపాయాలు.. భీమవరం, నరసాపురం రైల్వే స్టేషన్ లకు 75కోట్లు కేంద్రం కేటాయించిందన్నారు. గుడివాడ -భీమవరం రైల్వే అభివృద్ధికి 1200కోట్లు, కోటిపల్లి నరసాపురం రైల్వే అభివృద్ధికి 75శాతం నిధులు మంజూరు చేసినా రాష్ట్రం వాటాను వైసీపీ ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోపించారు. 


ఆక్వా రంగం అభివృద్ధికి సరిపల్లెలో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు కు 112 కోట్ల నిధులతో కేంద్రం సహకరిస్తోంది. జిల్లాలో లక్షా 5వేలు ఇళ్ళు మంజూరు చేస్తే ఎన్ని నిర్మాణం చేశారు. టిడ్కో ఇళ్ళు కాలనీల్లో మౌలిక సదుపాయాలు లేవు. వీధి లైట్లు లేవని విమర్శించారు. టిడ్కో ఇళ్ళు తాకట్టు పెట్టి బ్యాంకు రుణాలు వడ్డీ కట్టమంటోంది అంటూ జగన్ ప్రభుత్వంపై పురంధేశ్వరి మండిపడ్డారు. ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే ఎట్రాసిటీ కేసులు పెడుతూ నియంతృత్వం పాలన సాగుతోందని అభిప్రాయపడ్డారు. 


ఏపీలో అభివృద్ధి కోసం ప్రశ్నిస్తే కులవిభేదాలు సృష్టించి పబ్బం గడుపు కోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 40 లక్షల భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకపోయినా ఏపీ ప్రభుత్వానికి చలనం లేదని పురంధేశ్వరి విమర్శించారు. ఏపీ ప్రభుత్వంపై బీజేపీ పోరాటం కొనసాగుతోందని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కేంద్రం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథ్ రాజు, రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ, జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ, కపర్థి, తదితరులు పాల్గొన్నారు.
Also Read: Nagababu in Nellore: మంత్రులందరికీ హాఫ్ బ్రెయిన్, నెల్లూరులో నాగబాబు హాట్ కామెంట్స్