Cyclone Michaung Effect In Andhra Pradesh: మిన్ను విరిగి మీద పడ్డట్టుగా మిచౌంగ్ తుఫాన్ (Cyclone Michaung) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)పై విరుచుకుపడింది. జల విధ్వంసం సృష్టించింది. తుఫాన్ దాటికి ఏపీ అతలాకుతలమైంది. భారీ వర్షాలు, గాలులకు చిగురుటాకులా వణికిపోయింది. ఏపీ మొత్తాన్ని తుడిచిపెట్టిన మిచౌంగ్ మంగళవారం బాపట్ల (Bapatla) వద్ద తీరాన్ని దాటిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (Andhra Pradesh State Disaster Management) ప్రకటించింది. మధ్య కోస్తా ప్రాతంలో అల్పపీడనంగా బలహీనపడింది. కాలనీలు చెరువులను తలపించాయి. వాగులు వంకలు పొంగి ఇళ్లలోకి వరద చొచ్చుకు వచ్చింది.
బారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రాంతాలు జలదిగ్బంధంల్లో చిక్కుకున్నాయి. చెట్లు, కరెంట్ స్తంభాలు కూలి ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోఆయి. వేల ఎకరాల్లో పంట ధ్వంసమైంది. 770 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. 35 చెట్లు నేలకూలాయి, మూడు పశువులు మరణించాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం గణాంకాల ప్రకారం.. తుఫాన్ కారణంగా 194 గ్రామాలు, రెండు పట్టణాల్లో దాదాపు 40 లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. 25 గ్రామాలు ముంపునకు గురయ్యాయి.
మంగళవారం ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. సోమవారం తిరుపతి జిల్లాలో గుడిసె గోడ కూలి నాలుగేళ్ల బాలుడు మృతి చెందినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ డైరెక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. బాపట్ల జిల్లాలో మరొకరు మృతి చెందారు. ఆ మరణానికి తుఫాను కారణం కాదని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
భారత వాతావరణ శాఖ (IMD) తన తాజా బులెటిన్‌లో తుఫాను బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని వెల్లడించింది. ఇది బాపట్లకు ఉత్తర వాయువ్యంగా 100 కి.మీ మరియు ఖమ్మంకు ఆగ్నేయంగా 50 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. రానున్న 6 గంటల్లో మరింత బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని, ఆ తరువాత 6 గంటల్లో అల్పపీడనం బాగా తగ్గుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. బుధవారం విశాఖపట్నం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో 64.5 మిల్లీమీటర్ల నుంచి 115.5 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో మంగళవారం తిరుపతి జిల్లాల్లో ఏడు చోట్ల, నెల్లూరులో మూడు చోట్ల 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లా మనుబోలులో 366.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బాధిత జిల్లాల్లో సహాయక చర్యల కోసం ప్రభుత్వం రూ.23 కోట్లు మంజూరు చేసింది. దెబ్బతిన్న నిర్మాణాల్లో 78 గుడిసెలు, పశువుల కొట్టం ఉండగా, 232 ఇళ్లు నేలమట్టమయ్యాయి. రెండు కచ్చా ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.
తెలంగాణ
తుఫాన్ నేపథ్యంలో IMD హెచ్చరికల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వరి పంట దెబ్బతినకుండా, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ఎక్స్‌లో పేర్కొన్నారు.
తమిళనాడు
మిచౌంగ్ తుఫాను కారణంగా చెన్నై, దాని పొరుగు జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. 5,060 కోట్ల రూపాయల మధ్యంతర ఆర్థిక సహాయం అందించాలని లేఖలో పేర్కొన్నారు.