Asani Cyclone : ఆగ్నేయ బంగాళాఖాతంలో అసని తుపాను ఆంధ్రప్రదేశ్‌ వైపునకు దూసుకొస్తుంది. ఇప్పటికే తీవ్ర తుపానుగా మారిన అసని, పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి చేరువైంది. ప్రస్తుతం తుపాను పోర్ట్‌బ్లెయిర్‌కు వాయువ్య దిశలో 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. మంగళవారం రాత్రికి ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా తీరానికి అసని తుపాను సమీపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. తుపాను ప్రభావంతో తీరంలో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, మత్య్సకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. తీరానికి దగ్గరగా వచ్చిన తర్వాత తుపాను దిశ మార్చుకుని బెంగాల్‌ వైపు వెళ్తుందని తెలిపింది. 






ఏపీపై తీవ్ర ప్రభావం


అసని తుపాను బెంగాల్‌ వైపు వెళ్లినా ఏపీ తీరంపై ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం పార్వతీపురం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలపై తుపాను ప్రభావం ఉంటుందని అంచనా వేస్తుంది. ఈ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. 






సముద్రం అల్లకల్లోలం 


తుపాను ప్రభావంతో ఏపీ తీరంలో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. గంటలకు 40 నుంచి 50 కిలో మీటర్లు, గరిష్టంగా 60 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. మత్స్యకారులు గురువారం వరకు వేటకు వెళ్లొద్దని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తుపాను కారణంగా విశాఖపట్టణం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ముందుజాగ్రత్త చర్యగా లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. మంగళవారం నాటికి లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఒడిశా ప్రభుత్వం గంజాం, పూరీ, జగత్‌సింగ్‌పూర్, కేంద్రపాడ కలెక్టర్‌లను ఆదేశించింది.