Heavy Traffic Jam At Srisailam Reservoir: ఎగువన భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయం (Srisailam) జలకళను సంతరించుకోగా పది గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఈ క్రమంలో ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి పెరిగింది. వారంతపు సెలవులతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భారీగా ప్రాజెక్టును సందర్శించేందుకు తరలివస్తున్నారు. జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్ల నుంచి పరుగులు తీస్తున్న కృష్ణమ్మను చూస్తూ ఆహ్లాదంగా గడుపుతున్నారు. తొలుత శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్న అనంతరం ప్రాజెక్టు వద్ద నది అందాలను వీక్షిస్తూ సేద తీరుతున్నారు. దీంతో జలాశయం పరిసర మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జాం నెలకొంది. శనివారం ఆనకట్టకు ఇరువైపులా దాదాపు 4 కి.మీల మేర వాహనాలు బారులు తీరాయి.
కొందరు వాహనాలను రోడ్డుపైనే నిలిపి సెల్ఫీలు దిగుతుండడంతో పాటు లింగాలగట్టు ప్రాంతంలో చేపల విక్రయాలు చేస్తుండడంతో ట్రాఫిక్ మరింతగా పెరిగింది. పోలీసులు లేకపోవడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ నియంత్రించేలా అధికారులు చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో చేపలు పట్టడంపై నిషేధం ఉన్నా.. లింగాలగట్టు ప్రాంతంలో అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. చేపల విక్రయాలు తగ్గిస్తే ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని సందర్శకులు, వాహనదారులు చెబుతున్నారు.
కొనసాగుతోన్న నీటి విడుదల
మరోవైపు, ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి నీటి ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం క్రస్ట్ గేట్ల ద్వారా 4,64,740 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 62,668 క్యూసెక్కుల నీటిని అదనంగా నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. కాగా, ఎగువ ప్రాంతాలైన జూరాల, సుంకేశుల జలాశయాల నుంచి 4,81,246 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలశయానికి వస్తోంది. శనివారం మధ్యాహ్నానికి నీటి మట్టం 882.80 అడుగులుగా ఉంది. 203.490 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది.
నాగార్జునసాగర్‌కు భారీగా వరద
మరోవైపు, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు (Nagarjuna Sagar Project) భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. సాగర్ ఇన్ ఫ్లో: 4,19,588 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో: 34,088 క్యూసెక్కులకు చేరుకుంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం: 590.00 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం: 561.40 అడుగులకు చేరుకుంది. సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం: 312.50 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం: 231.9106 టీఎంసీలకు చేరుకుంది. సాగర్‌కు భారీగా ఇన్‌ఫ్లో వస్తుండగా, సోమవారం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసే అవకాశం ఉందని సమాచారం. అయితే ఏ క్షణమైనా సాగర్ గేట్లు తెరిచే అవకాశం ఉందని, అదికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్ సూచించారు. డ్యాం భద్రతకు ఢోకా లేకుండా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేయాలన్నారు. కంట్రోల్ రూమ్‌లో నీటి నివేదికలను జాగ్రత్తగా నమోదు చేయాలని సూచించారు.
పర్యాటకుల తాకిడి
అటు, సాగర్‌లోనూ వరద ప్రవాహం పెరుగుతున్న క్రమంలో పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాక వివిధ ప్రాంతాల నుంచి సాగర్ అందాలు చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. అలాగే, సమీప పర్యాటక ప్రాంతాలైన డౌన్ పార్క్, బుద్ధవనం, అనుపు, ఎత్తిపోతల, కొత్త వంతెన వద్ద పర్యాటకులు సందడి చేస్తున్నారు
Also Read: Viral Video: అమెరికాలో సత్యనారాయణ స్వామి వ్రతం - ఇంగ్లీష్‌లో సత్యదేవుని వ్రత కథ, వైరల్ వీడియో