Bjp Vishnu On Seema : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్వాకం వల్ల రాయలసీమలోని రెండు జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నాయని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి మండిపడ్డారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు కరెంటు సరఫరా నిలిపివేయడం వల్ల రెండు జిల్లాలకు నీరందడం లేదన్నారు. పెద్ద ఎత్తున ప్రాజెక్టులకు వరద వచ్చి సముద్రంలోకి నీళ్లు వెళ్తిపోతున్నా.. పంటలకు నీరు ఇవ్వలేరా అని ప్రశ్నించారు. సమస్యను తక్షణం పరిష్కరించి నీళ్లివ్వకపోతే బిజెపి రాయలసీమ వ్యాపితంగా ప్రజా ఉద్యమం చేపడుతుందని విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు.
హంద్రీ నీవా ఎత్తిపోతల విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో ఆగిపోయిన నీటి సరఫరా
విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో హంద్రీనీవా ప్రాజెక్టుకు కరెంటు సరఫరా నిలిపివేశారు. దీంతో ప్రాజెక్టు ఆయుకట్టకకు నీటి సరఫరా నిలిచిపోయింది. కరెంటు సరఫరా నిలిపివేసి రెండు వారాలు గడుస్తున్నా ప్రభుత్వ యంత్రాంగంలో నామమాత్రపు చలనం లేదని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. కొద్ది రోజులుగా నీరు అందక పంటలు వాడుతున్నా నీటిని విడుదల చేయకపోవడంతో కరెంటు సరఫరాను నిలిపివేసిన సంగతి వెలుగులోకి వచ్చింది. అధికారుల ఈ నిర్లక్ష్య వైఖరిపై రైతాంగంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
కర్నూలు, అనంతపురం జిల్లాల్లో లక్ష ఎకరాలకు ఆగిపోయిన నీరు..ఎండిపోతున్న పంటలు
హంద్రీనీవా ప్రాజెక్టు కింద కర్నూలు జిల్లాలో 40వేల ఎకరాలు, అనంతపురం జిల్లాలో లక్ష ఎకరాలకుపైగా ఆయకట్టు వుంది. మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, వరి, మిరప, తదితర పంటలను సాగుచేశారు. ఇందులో ఇప్పటికే పంటి చేతికి వచ్చిన మొక్కజొన్న పంటకు మినహా అన్ని పంటలు నీరు అవసరం వుంది. నీరులేక వాడుముఖం పట్టాయి. కళ్లెదుటే పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
బకాయిలు చెల్లించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించి నీరు అందించాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్
హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు కింద దాదాపు 320 కోట్ల రూపాయలు, మచ్చుమర్రి ఎత్తి పోతల కింద 57 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు ఉన్నాయి. ఈ మొత్తాన్ని చెల్లించాలని విద్యుత్‌సంస్థలు పదేపదే కోరుతున్నా ఫలితం కనిపించలేదు. దీంతో రెండు వారాల క్రితం కరెంటు సరఫరాను నిలిపివేశారు. ప్రభుత్వం చెబితే బకాయిల చెల్లింపుతో నిమిత్తం లేకుండా కరెంటు సరఫరా అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశలోనూ చర్యలు తీసుకోలేదు. మరోవైపు హంద్రీనీవా ప్రాజెక్టు పంపుల నిర్వహణ పనులు చేస్తున్న కాంట్రాక్టరుకు రూ 32కోట్ల బకాయి వుంది. ఆ బకాయిని కూడా చెల్లించాలని, లేని పక్షంలో కరెంటు పునురుద్దరణ జరిగినా పైపుల నుండి నీటి సరఫరా జరగదని కాంట్రాక్టర్ చెబుతున్నట్లు సమాచారం. దీంతో అధికారులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన ఏపీ బీజేపీ రైతుల తరపున పోరాటానికి సిద్ధమయింది. తక్షణం స్పందించకపోతే.. రైతులతో కలిసి పోరాటాలకు సిద్ధమవుతామని విష్ణువర్దన్ రెడ్డి ప్రకటించారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున ఎగువ నుంచి వరద వచ్చింది. ఈ కారణంగా నీటిని సముద్రంలోకి పంపారు. రాయలసీమకు కావాల్సినతంగా పంపిణీ చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో కనెక్షన్లు తీసేయడంతో.. పంట పొాలాలకు నీరు అఅందడం లేదు.