Coronavirus Cases In AP: కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనా వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు. అయితే నిన్నటితో పోల్చితే కరోనా పాజిటివ్ కేసులు 200 మేర తగ్గాయి. కొవిడ్ మరణాలు సైతం స్వల్పంగా తగ్గాయి. గత రెండు నెలల నుంచి ఏపీలో కరోనా కేసులు దాదాపు వెయ్యి, లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,174 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో రాష్ట్రంలో మరో 9  మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ మరణించారు. 


ఏపీలో కరోనా రికవరీ రేటు మెరుగ్గా ఉందని వైద్య శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు 20,34,458 కు గాను నేటి ఉదయం వరకు 20,05,744 మంది కోలుకుని ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. నిన్నటితో పోల్చితే యాక్టివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. ఏపీలో ప్రస్తుతం 14,653 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. ఈ మేరకు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 


Also Read: మీ కిడ్నీలో రాళ్లు ఉన్నాయా? ఈ ఇంటి చిట్కాలతో రాళ్లను తరిమికొట్టండి... ఆరోగ్యంగా ఉండండి






ఏపీలో అధికంగా గుంటూరు జిల్లాలో ముగ్గురు చనిపోయారు. చిత్తూరులో ఇద్దరు, కడప, కృష్ణా, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు కొవిడ్19కు చికిత్స పొందుతూ మరణించారు. ఏపీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,061కు చేరింది. కేసులవారీగా చూస్తే గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 208, ప్రకాశంలో 161, చిత్తూరులో 159 మంది కరోనా బారిన పడ్డారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 5, విజయనగరం జిల్లాలో 10, అనంతపురం జిల్లాలో 18 మందికి కరోనా సోకినట్లు ఏపీ వైద్య శాఖ తెలిపింది.


Also Read: మునగాకు ఔషధాల గని... ఆహారంలో భాగం చేసుకోండి... అద్భుత ప్రయోజనాలు పొందండి


ఏపీలో ఇప్పటివరకూ 2 కోట్ల 76 లక్షల 52 వేల 514 శాంపిల్స్‌కు కొవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అందులో గడిచిన 24 గంటల్లో 55,525 శాంపిల్స్ టెస్టు చేసినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజల ఆరోగ్యంపై ఫోకస్ చేసిన ఏపీ ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది.