Coronavirus Cases: ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసింది. గత వారం కరోనా కేసులు వెయ్యి దిగువన నమోదయ్యేవి. కానీ ఈ వారం ప్రతిరోజూ వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు రావడంతో అధికారులు, వైద్య శాఖ అప్రమత్తం అయింది. నిన్నటితో పోల్చితే పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరగగా.. కొవిడ్ మరణాలు తగ్గడం ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,393 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో రాష్ట్రంలో మరో 8  మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ మరణించారు. 


ఏపీలో కరోనా రికవరీ రేటు మెరుగ్గా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు 20,33,284 కు గాను నేటి ఉదయం వరకు 20,04,435 మంది కోలుకుని ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్నటితో పోల్చితే యాక్టివ్ కేసులు పెరిగాయి. ఏపీలో ప్రస్తుతం 14,797 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. ఈ మేరకు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 


Also Read: అధికంగా జుట్టు రాలుతోందా... ఇవి ట్రై చేయండి






ఏపీలో ఇప్పటివరకూ 2.5 కోట్ల మందికి టీకాలు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజల ఆరోగ్యంపై ఫోకస్ చేసిన ఏపీ ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 2.5 కోట్ల మందికి కనీసం ఒక డోసు టీకాలు ఇచ్చినట్లు ఆరోగ్య ఆంధ్ర ట్విట్టర్‌లో వెల్లడించారు. 


Also Read: గర్భవతులు కాఫీ తాగొచ్చా? తాగితే ఏమవుతుంది? పుట్టబోయే బిడ్డకు ఎంత ప్రమాదమో తెలుసా?