ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెయ్యికి పైగా నమోదయ్యాయి. క్రితం రోజుతో పోల్చితే దాదాపు 200 మేర కేసులు పెరిగాయి. గత నెలన్నర రోజులుగా దాదాపుగా వెయ్యి మేర కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్నటితో పోల్చితే కొవిడ్ మరణాలు సైతం పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,125 మందికి కరోనా సోకింది. అదే సమయంలో రాష్ట్రంలో మరో 9 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ మరణించారు.
ఏపీలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2 మిలియన్లకు చేరింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 20,29,079 పాజిటివ్ కేసులకు గాను 20,00,648 మంది కోలుకుని ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసులు వరుసగా రెండో రోజు 15 వేల దిగువకు వచ్చాయి. ఏపీలో ప్రస్తుతం 14,412 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Also Read: మీరు వాడే వంటనూనె మంచిదో, కల్తీదో తెలుసా? ఇలా చేస్తే ఇట్టే తెలిసిపోతోంది...
14 వేలు దాటిన మరణాలు..
ఏపీలో కొవిడ్19 మరణాలు 14 వేలు దాటిపోయాయి. సెప్టెంబర్ 14న ఉదయం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 14,019 మంది కొవిడ్ బారిన పడి మరణించారు. తాజా పాటిజివ్ కేసులతో పోల్చితే కోలుకున్న వారే అధికంగా ఉండటం ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,356 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు మెరుగ్గా ఉందని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.
ఏపీలో అధికంగా కృష్ణా జిల్లాలో ముగ్గురు కరోనా బారిన పడి చనిపోగా.. పశ్చిమ గోదావరిలో ఇద్దరు, తూర్పు గోదావరి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ఏపీలో ఇప్పటివరకూ 2 కోట్ల 74 లక్షల 13 వేల 209 శాంపిల్స్‌కు కొవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అందులో గడిచిన 24 గంటల్లో 49,7568 శాంపిల్స్ టెస్టు చేసినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు.
Also Read: ఈ లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోకండి... వైద్యుడిని కలవండి
చిత్తూరు జిల్లాలో 210 మంది కరోనా బారిన పడగా.. ఆ తరువాత నెల్లూరు జిల్లాలో 184, కృష్ణా జిల్లాలో 164, పశ్చిమ గోదావరి జిల్లాలో 161 మందికి కరోనా సోకింది. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 7, అనంతపురం జిల్లాలో 16 మంది కరోనా బారిన పడ్డారని తాజా బులెటిన్‌లో ఏపీ వైద్య శాఖ తెలిపింది.