Andhra News : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పేర్ని నాని వర్సెస్ ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ వ్యవహారం తాడేపల్లికి చేరింది. ఇవాళ సెక్రెటరియేట్లో సీఎస్ జవహర్ రెడ్డి ని పేర్ని నాని కలిశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా జెడ్పీ సమావేశానికి ప్రసన్న వెంకటేశ్ రాకపోవడంపై పేర్ని నాని ఫిర్యాదు చేశారు. జిల్లాల విభజన అనంతరం ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే జరుగుతోన్న జెడ్పీ సమావేశాలకు పలువురు కలెక్టర్లు హాజరు కావడం లేదని పేర్ని నాని చెప్పారు. ప్రసన్న వెంకటేశ్ తీరుకి వ్యతిరేకంగా సీఎం జగన్ ఇంటి వద్ద ధర్నా చేస్తానని మరోసారి ప్రకటించారు.
పేర్ని నాని తీరుపై సీఎంవోలో ఫిర్యాదు చేసిన ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్
అదే సమయంలో ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్.. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లారు. పేర్ని నానితో వివాదం గురించి చెప్పారు. తాను ఏలూరు కలెక్టర్ గా ఉన్నందున ఉమ్మడి కృష్ణా జిల్లా జెడ్పీ సమావేశాలుకు వెళ్లాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో పేర్ని నాని సీఎస్ ను కలిసి కలెక్టర్ పై ఫిర్యాదు చేయడంతో.. కలెక్టర్ వర్సెస్ మాజీ మంత్రి మధ్య బయటకు తెలియని ఏదో వివాదం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
మరోసారి సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తానని పేర్ని నాని హెచ్చరిక
బుధవారం జడ్పీ మీటింగ్‌లో ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ పై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను గౌరవించని వారిని ఉపేక్షించకూడదని చెప్పారు. ఉమ్మడి కృష్ణాలో సమావేశాలకు రాకుండా సన్న వెంకటేశ్ రాకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు. వారి తీరుపై తాను జెడ్పీటీసీ సభ్యులతో వెళ్లి సీఎం ఆఫీసు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాల వద్ద నిరసనకు దిగుతానని హెచ్చరించారు. ఇవాళ కూడా సీఎం క్యాంప్ ఆఫీసు ముందు ధర్నా చేస్తానని ప్రకటించడం వివాదం అవుతోంది.
ఇరువురి మధ్య అంతకు మించిన వేరే వివాదం ఉందా ?
పేర్ని నాని ఈ వివాదంలోకి ముఖ్యమంత్రి జగన్ ను తీసుకు రావడం .. వైఎస్ఆర్సీపీలో చర్చనీయాంశమవుతోంది. కరెక్టర్లు జడ్పీ మీటింగ్‌కు వెళ్లాలా వద్దా అన్నది అధికారుల స్థాయిలో నిబంధనలను బట్టి నిర్ణయం తీసుకుంటారని.. ఇలాంటి అంశాన్ని సీఎంకు ముడి పెట్టేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారన్న చర్చ వైసీపీలో జరుగుతోంది. ఇటీవలి కాలంలో పేర్ని నాని రాజకీయంగా వివాదాస్పదంగా ప్రవర్తిస్తున్నారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చెబుతున్నారు. అదే సమయంలో ఇలాంటి వివాదాలు రేపుతూండటానికి కారణం ఏమిటని వైసీపీ వర్గాలు ఆరా తీస్తున్నాయి.