Gudivada Politics: గుడివాడలో టీడీపీ, వైసీపీ మధ్య రోజంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ , టీడీపీ రెండు ఒకే రోజు నియోజకవర్గ స్థాయి కార్యక్రమాలు పెట్టుకున్నాయి. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ పేరుతో వైసీపీ విస్తృత స్థాయి సభ ఏర్పాటు చేసింది. ఏడాది పాలన అయిన సందర్భంగా టీడీపీ కూడా తొలి అడుగు కార్యక్రమం ఏర్పాటు చేసుకుంది. అదే సమయంలో వైసీపీ కార్యక్రమానికి కొడాలి నాని వస్తారన్న ప్రచారం జరిగింది. రప్పా రప్పా నరుకుతామని పేర్ని నాని హెచ్చరించిన వీడియో వైరల్ అయిన సమయంలో.. ఆయన కూడా వస్తారని తెలియడంతో టీడీపీ కార్యకర్తలు.. పెద్ద ఎత్తున గుడివాడలో గుమికూడారు.
అదే సమయంలో మాజీమంత్రి కొడాలి నాని, సీఎం చంద్రబాబు బూట్ పాలిష్ చేస్తున్నట్లు నెహ్రూ చౌక్ సెంటర్లో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే...బూట్ పాలిష్ చేసి కాళ్ళ దగ్గర ఉంటానంటూ కొడాలి నాని చేసిన చాలెంజ్ నిలబెట్టుకోవాలంటూ..గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పేరుతో ఫ్లీక్సీని ఏర్పాటు చేశారు.
వైసీపీ నేతలు కూడా మోసం గ్యారంటీ ఫ్లెక్సీలు వేశారు. అయితే వాటిని టీడీపీ కార్యకర్తలు చింపేశారు.
ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటంతో కొడాలి నాని సమావేశానికి రాలేదు. గుడివాడ వన్ టౌన్ పీఎస్ లో సంతకం చేసి హైదరాబాద్ వెళ్లిపోయారు కొడాలి నాని. ముఖ్యమైన నాయకులు ఎవరూ రాకపోవడంతో.. ద్వితీయ శ్రేణి నేతలతోనే గుడివాడ నియోజకవర్గంలో సమావేశాన్ని పూర్తి చేశారు. రప్పా రప్పా మీతోనే మొదలు పెడుతామని.. కొడాలి నాని ముఖ్య అనుచరుడు మెరుగుమాల కాళీ సమావేశంలో హెచ్చరిచారు.
అదే సమయంలో గుడివాడ పట్టణంలోని 19, 20, 23, 24వ వార్డుల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా APSWC చైర్మన్ రావి వెంకటేశ్వరరావు తో కలిసి కూటమి ప్రభుత్వం ఏడాదిలో అందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రజలకు వివరించారు.
వైసీపీ ముఖ్యనేతలెవరూ గుడివాడ రాకపోవడంతో.. ఉద్రిక్తలు ఘర్షణల వరకూ వెళ్లకుండా ఆగిపోయాయి.