Srikalahasti Jana Sena in charge PA Murder Case: శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జ్ వినూత కోట పర్సనల్ అసిస్టెంట్ , డ్రైవర్ గా పని చేసే శ్రీనివాసులు అలియాస్ రాయుడును హత్య చేసిన ఘటనలో చెన్నై పోలీసులు సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చారు. పీఏను రేణిగుంటలోనే చంపేసి చెన్నై తీసుకు వచ్చి పడేసినట్లుగా పోలీసులు గుర్తించారు. శ్రీకాళహస్తి ఘటనపై  చెన్నై నగర పోలీస్ కమీషనర్ అరుణ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. 

సెవెన్ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలువ వద్ద నాలుగు రోజుల క్రితం ఒక గుర్తు తెలియని  మృతదేహం  గుర్తించారు. పోలీసులు  అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  సీసీ ఫుటేజ్ ద్వారా మృతదేహాన్ని తీసుకువచ్చిన కారును గుర్తించారు. అదే సమయంలో మృతుడి చేతి మీద వినూత కోట అనే పేరు కూడా ఉంది. ఈ క్లూల ద్వారా గుర్తించి  ఐదుగురుని అరెస్టు చేశాశారు.  జనసేన పార్టీకి చెందిన వినూతతో పాటు మొత్తం ఐదుగురు ఈ హత్యలో పాల్గొన్నారు. వీరు నేరాన్ని అంగీకరించారని పోలీస్ కమిషనర్ ప్రకటించారు. 

తమ రాజకీయ ప్రత్యర్థులకు డ్రైవర్ రాయుడు కీలక  సమాచారాన్ని రహస్యంగా చేరవేసేవాడని, ఈ కారణంగానే అతన్ని హత్య చేసినట్లు నిందితులు చెబుతున్నారని పోలీస్ కమి,నర్ చెప్పారు. ఈ నిందితులంతా   వైద్య అవసరాల కోసం తరచుగా చెన్నైకి వచ్చేవారని, ఈ రూటు బాగా తెలిసినందువల్లే మృతదేహాన్ని ఇక్కడ వరకు తీసుకొచ్చి పడేశామని నిందితులు పోలీసులకు చెప్పారు.  ఈ కేసులో మరింత దర్యాప్తు జరగాల్సి ఉందని కమిషనర్ అరుణ్ తెలిపారు. నిందితుల్ని కోర్టులో  ప్రొడ్యూస్ చేయడంతో వారికి పధ్నాలుగు రోజులు రిమాండ్ విధించారు. 

కోట వినూత దంపతులకు అత్యంత సన్నిహితుడు అయిన డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడ్ని చంపాల్సిన అవసరం వారికి ఎందుకు వచ్చిందో చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల నుంచి  వారు సోషల్ మీడియాలో.. డ్రైవర్ రాయుడుతో సంబంధం లేదని ప్రకటిస్తూ వస్తున్నారు. అంటే.. ఆయనను బంధించి చిత్రహింసలు పెడుతూ.. ఏటో వెళ్లిపోయాడని నమ్మించేందుకు ఇలాంటి ప్రకటనలు చేసినట్లుగా తెలుస్తోంది. తర్వాత చంపేసి.. ఎవరికీ డౌట్ రాకుండా పక్క రాష్ట్రంలో పడేసి వచ్చినట్లుగా తెలుస్తోంది.  

ఐదుగురు నిందితుల ఫోటోలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. ఈ కేసు తమిళనాడులోనూ సంచలనం సృష్టించింది. పవన్ కల్యాణ్ పేరు ఇటీవలి కాలంలో తమిళనాడులోనూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన పార్టీకి చెందిన నేతలు  కావడంతో.. అక్కడ కూడా ఈ కేసు చర్చనీయాంశం అవుతోంది.