Communist party leaders meet Chandrababu: ఉమ్మడి అనంతపురం జిల్లా ముదిగబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ భూకబ్జాలపై కమ్యూనిస్టు పార్టీలు పోరాటం చేస్తున్నాయి. అడవి బ్రాహ్మణ పల్లి తండాలో గిరిజనులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను  బీజేపీ నేత ఆదినారాయణ యాదవ్ ఆన్ లైన్ చేయించుకున్నారు. ఈ అంశం సంచలనం రేపుతోంది. గిరిజనులకు అండగా అన్ని రాజకీయ పార్టీలు పోరాడుతున్నాయి. కమ్యూనిస్టు పార్టీల నేతలు అడవి బ్రాహ్మణపల్లిలో పర్యటించారు. తాజాగా చంద్రబాబును కలిసి చర్యలు తీసుకోవాలని గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు.  సీపీఐ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ .. ఆదినారాయణ అరాచకాలను చంద్రబాబుకు వివరించారు. 

 సత్య సాయి జిల్లా ముదిగుబ్బ మండలం అడవి  బ్రాహ్మణపల్లి  తండాకు చెందిన పేద గిరిజన భూములను అక్రమంగా ఆక్రమించి వారి కుటుంబ సభ్యుల పేరు మీద   ఆన్ లైన్  చేయించుకున్నారని ఆదినారాయణపై ఆరోపణలు వచ్చాయి.   వాటి మీద పట్టాదారు  పాస్ పుస్తకాలు చేసుకుని   లోన్లు కూడా తీసుకున్నారని గిరిజునలు ఆరోపిస్తున్నారు.   ఈ లోన్లను గిరిజనులు తిరిగి చెల్లించాలని  ఆదినారాయణ ఒత్తిడి చేస్తున్నారు. గతంలో వైసీపీలో ఉండేవారు. వైసీపీ అగ్రనేతలు తనకు సన్నిహితులని చెప్పి పెనుగొండ  కియా పరిశ్రమల వద్ద, లేపాక్షి చిలమత్తూరు  కోడికొండచెక్ పోస్ట్ వద్ద దాదాపు 90 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను   బంధువుల పేరు మీద  బినామీల పేరు మీద మార్పించుకున్నారని చెబుతున్నారు.  

ఈ అక్రమాలన్నింటిపై  సిట్ నియమించి దర్యాప్తు చేయించాలని  ఇటీవల మంత్రి అనగాని సత్యప్రసాద్ ను పలువురు బాధఇతులు కలసి విజ్ఞాపన పత్రం ఇచ్చారు. 

ఆదినారాయణపై చాలా కేసులు ఉన్నాయి.   కొద్ది రోజుల కిందట అదానీ కంపెనీ అన్నమయ్య జిల్లాలో చేపట్టిన ఓ ప్రాజెక్టు వద్ద కమిషన్లు ఇవ్వలేదని కొంత మంది వ్యక్తులు దాడి చేశారు. అదానీ సంస్థల పైనే దాడులు చేసింది ఆదినారాయణలేనని చెబుతున్నారు.   2022లో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తను సూరప నేని రమేశ్ చౌదరి ని కిడ్నాప్ చేసి, డబ్బులు వసూలు చేసిన కేసులో నిందితుడుగా ఉన్నారు. నకిలీ తుపాకులతో ప్రైవేటు సైన్యాన్ని తీసుకెళ్లి బెదిరించి స్థలాలు కబ్జాలు చేసిన కేసులు కూడా ఉన్నాయి. ఇటీవల   పెనుకొండలో నమోదైన కబ్జా కేసులో నిందితుడుగాఉన్నట్లుగా తెలుస్తోంది. 

ముదిగుబ్బ మండలానికి ఎంపీపీగా ఉన్న ఆయన మొదటగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉండేది. టీడీపీ అధికారంలోకి వచ్చాక మంత్రిగా ఉన్న పల్లె రఘునాథ రెడ్డి దగ్గర చేరారు. ఆయన మందీ మార్భలం చూసి  పార్టీలో చేర్చుకుని ప్రోత్సహం ఇచ్చారు. టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో అధికారంలోకి వచ్చిన వైసీపీలో చేరారు. అక్కడ ఆయన చేసిన దందాలకు లెక్కలేదు. ఎన్నికలు దగ్గర పడిన తర్వాత కూటమి గెలుపు ఖాయమని అంచనాకు వచ్చి బీజేపీలో చేరిపోయారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇక ఆదినారాయణ దందాలకు అడ్డం లేకుండా పోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కబ్జాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన న్యాయం చేస్తారని గిరిజనులు ఆశగా ఎదురు చూస్తున్నారు.