Dil Raju On Gaddar Awards: ఏప్రిల్‌లో 'గద్దర్' అవార్డ్స్... పదేళ్లలో సినిమాలకు ఒకే వేదికపై - దిల్ రాజు కీలక ప్రెస్‌మీట్
Telangana Govt Gaddar Awards 2025: ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం సినిమా అవార్డులను ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఆ అవార్డు వేడుక నిర్వహిస్తామని దిల్ రాజు తెలిపారు.

దివంగత గాయకుడు, విప్లవ గీతాల రచయిత, ప్రజా యుద్ధ నౌకగా పేరు గాంచిన గద్దర్ (Gaddar) పేరుతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అవార్డులు నిర్వహించనున్నట్లు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ 'దిల్' రాజు (Dil Raju) ఈ రోజు తెలిపారు.
తెలంగాణ ఏర్పాటైన తర్వాత నుంచి ఇప్పటి వరకు...
గద్దర్ పురస్కారాలను తెలంగాణ రాష్ట్రం అవతరించిన 2014వ సంవత్సరం నుంచి 2023వ సంవత్సరం వరకు... సుమారు పదేళ్ల సమయంలో వచ్చిన చిత్రాలలో ప్రతి ఏడాది ఓ ఉత్తమ సినిమా ఎంపిక చేస్తామని, ఏప్రిల్ నెలలో అవార్డులు ఇవ్వనున్నామని 'దిల్' రాజు తెలిపారు. ఉర్దూలో వచ్చిన సినిమాలకు ప్రత్యేకంగా 'ఉత్తమ సినిమా - ఉర్దూ' ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఈ రోజు తెలంగాణ సమాచార భవన్‌లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
గద్దర్ అవార్డ్స్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిందని దిల్ రాజు వివరించారు. భారతీయ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేతృత్వంలోని అప్పటి తెలంగాణ ప్రభుత్వం సింహా పేరుతో అవార్డులు ఇవ్వనున్నట్లు అనౌన్స్ చేసిన విషయం పరిశ్రమ ప్రముఖులతో పాటు ప్రేక్షకులకు కూడా గుర్తు ఉండే ఉంటుంది. అప్పట్లో అవార్డులకు కొందరు దరఖాస్తు కూడా చేశారు. ఆ సమయంలో దరఖాస్తులతో పాటు కట్టిన డబ్బులను ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి తిరిగి ఇవ్వనున్నట్లు 'దిల్' రాజు వివరించారు.
గద్దర్ అవార్డ్స్ కోసం ఏర్పాటు అయినా జ్యూరీ కమిటీ ఒక వారంలో అవార్డు విజేతలను ఖరారు చేస్తుందని 'దిల్' రాజు తెలిపారు. ఈ పురస్కారాల కోసం ఒక నమూనా సిద్ధం అవుతోందని, ఇప్పటికే జ్యూరీ కమిటీకి గైడ్ లైన్స్ ప్రిపేర్ అయ్యాయని, అద్భుతంగా పురస్కారాల వేడుక జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే గద్దర్ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన దర్శక - నిర్మాతలకు, నటీనటులకు ప్రోత్సాహం ఉండాలని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన అవార్డులలో చిత్రసీమలోని తెలంగాణ వ్యక్తులకు అన్యాయం జరిగిందనే అభిప్రాయం కొందరిలో ఉంది. దాంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చే అవార్డులపై అందరి దృష్టి నెలకొంది.
అవార్డులు ఎవరైనా ఇవ్వచ్చు... నెగిటివ్ ప్రచారం వద్దు!
వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత ఏపీ ప్రభుత్వం తెలుగు సినిమా పురస్కారాలను ఇవ్వలేదు. నంది అవార్డులను పూర్తిగా పక్కన పెట్టింది. అదే సమయంలో అప్పటి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం సైతం సింహా పురస్కారాలు ప్రకటించినా ఆ తర్వాత ఆ అవార్డులు ఊసు ఎత్తలేదు. చిత్రసీమను పట్టించుకోవడం లేదని, ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నాయని కొందరు ప్రముఖులు ఆఫ్ ద రికార్డు విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి.
Also Read: సౌందర్య మరణానికి మోహన్ బాబు కారణమా? ఆమె భర్త రఘు ఏమంటున్నారు? లేఖలో ఏం చెప్పారు?
ఇటీవల తెలుగు ఫిలిం ఛాంబర్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో తమ ఛాంబర్ తరపున అవార్డులు ఇవ్వనున్నట్లు మురళీమోహన్ వంటి ప్రముఖులు వెల్లడించారు. దాంతో గద్దర్ అవార్డులకు పోటీగా ఛాంబర్ అవార్డులు ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగింది. వాటిని అగ్ర నిర్మాత, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి దిల్ రాజు ఖండించారు. అవార్డులు ఎవరైనా ఇవ్వవచ్చని, ఫిలిం ఛాంబర్ కూడా ఇస్తుందని, మనం ఏ పని చేసిన 51 శాతం పాజిటివ్‌గా ఉంటే చాలని నెగటివ్ ప్రచారాలు అనవసరమని ఆయన తెలిపారు.
Also Read: సినిమాల్లో బోల్డ్, సె*** సీన్స్... ఎందుకు చేయడం లేదో చెప్పిన కరీనా కపూర్