Seediri Appalraju : ఆంధ్రప్రదేశ్ మంత్రి సీదిరి అప్పలరాజుకు సీఎంవో కార్యాలయం నుంచి ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. ఉన్న పళంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి వారాలని ఆయనకు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఆయన వెంటనే బయలుదేరి విజయవాడ వెళ్లారు. మరే మంత్రినీ పిలువలేదని.. కేవలం ఆయన ఒక్కరిని మాత్రమే పిలిచారని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. ఒక్క సీదిరి అప్పలరాజునే ఎందుకు సీఎం జగన్ పిలిపించారనేది ఆసక్తికరంగా మారింది.
మంత్రివర్గ మార్పుచేర్పుల ప్రచారంతో అప్పలరాజుకు టెన్షన్
త్వరలో సీఎం జగన్ మంత్రివర్గాన్ని మార్చబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ నెల మొదటి వారంలోనే ఎన్నికల టీమ్‌ను ఖరారు చేసుకుంటారని ఇందులో భాగంగా కొంత మంది మంత్రుల్ని తప్పిస్తారని చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైఎస్ఆర్‌సీపీ పరాజయం పాలైంది. ఎన్నికల బాధ్యతలను మంత్రులవేనని.. గెలిపించాల్సిన బాధ్యత వారిపైనే ఉందని లేకపోతే చర్యలు తప్పవని సీఎం జగన్ పలుమార్లు కేబినెట్ భేటీల్లో హెచ్చరించారు. ఈ క్రమంలో సీదిరి అప్పలరాజును కేబినెట్ నుంచి తప్పిస్తారేమోనన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే ఆయనను సీఎంవోకు పిలిపించి ఉంటారని చెబుతున్నారు.
తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన అప్పలరాజు
మంత్రి సీదిరి అప్పలరాజు తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ... సీఎం జగన్ మంత్రి పదవి ఇచ్చారు. తొలి సారి ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ మోపిదేవి వెంకటరమణకు సీఎం జగన్ మంత్రిపదవి ఇచ్చారు. తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు. మండలి రద్దు తీర్మానం చేసిన తర్వాత వారిని మంత్రి పదవుల నుంచి తప్పించారు. అదే సామాజికవర్గం నుంచి సీదిరి అప్పలరాజుకు చాన్స్ ఇచ్చారు. మంత్రులందరితో రాజీనామాలు తీసుకున్నప్పుడు సీదిరి అప్పలరాజుతోనూ రాజీనామా చేయించారు.. కానీ మళ్లీ ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ఆయన మంత్రి పదవి కంటిన్యూ అవుతోంది.
ఇటీవలి కాలంలో వరుస వివాదాలు
ఇటీవలి కాలంలో సీదిరి అప్పలరాజు చుట్టూ అనేక ఆరోపణలు ముసురుకుంటున్నాయి. ఆయన ముగ్గురు వ్యక్తులని పెట్టుకుని అవినీతికి పాల్పడుతున్నారని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తనపై ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఆయన సవాల్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సుల్లోనూ ఆయన అవినీతిపై ఓటర్లు లేఖలు రాశారన్న ప్రచారం జరిగింది.అయితే అలాంటిదేమీ లేదని సీదిరి అప్పలరాజు ఖండించారు. ఇప్పుడు సీఎం జగన్ ఆయనను అత్యవసర సమావేశానికి పిలువడంతో అది మంత్రి పదవి కోసమేనన్న చర్చ ఊపందుకుంటోంది.
అయితే అప్పలరాజు మాత్రం తన పై వచ్చేవన్నీ రాజకీయ విమర్శలేనని ఆ విషయం సీఎంజగన్‌కు తెలుసని నమ్ముతున్నారు. సీఎం జగన్ కు అత్యంత నమ్మకస్తుడినని ఎన్నికల టీం నుంచి తనను పక్కన పెట్టరని భావిస్తున్నారు. అందుకే తన పదవి ఎక్కడికీ పోదని ధీమాగా ఉన్నారు. సీఎం జగన్ ఎందుకుపిలిచారన్నది హైకమాండ్‌లో ముఖ్యులకు తప్ప ఎవరికీ తెలియు. సమావేశం పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.