CM Jagan will give MP ticket to actor Ali  : సినిమాల్లో మంచి పేరు సంపాదిచిన అలీకి ప్రజాప్రతినిధి కావాలని గట్టి కోరిక. గత ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరారు. కానీ పోటీ చేసే చాన్స్ రాలేదు. ఈ సారి సీఎం జగన్ అవకాశం కల్పిస్తారని అనుకుంటున్నారు. ఎమ్మెల్యేగా ఆయనకు ఎక్కడా అవకాశం లేదు. కానీ ఎంపీ సీటుకు చాన్స్ ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నారు. ఓ మైనార్టీకి చాన్సివ్వాలని అనుకుంటున్న జగన్..  అలీ పేరును పరిశీలనలోకి తీసుకుంటున్నారని అంటున్నారు. 


రాజమండ్రికి చెందినప్పటికీ ఆయనకు యాక్టర్ గా రాష్ట్రం మొత్తం గుర్తింపు ఉంది. అందుకే  నంద్యాల పార్లమెంట్ స్థానానికి వైసీపీ అధిష్టానం ఆయన పేరును  పరిశీలిస్తోందని చెబుతున్నారు.  రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైసీపీ అధిష్టానం ఇప్పటివరకు ఆరు దఫాలుగా సీట్ల మార్పు చేర్పులు చేసింది. అందులో 70 అసెంబ్లీ స్థానాలు, 18 ఎంపీ స్థానాలు ప్రకటించింది. ఇంకా 105 అసెంబ్లీ స్థానాలు, 7 ఎంపీ స్థానాలు ప్రకటించాల్సి ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు, నంద్యాల పార్లమెంట్ స్థానాలు న్నాయి. అయితే అధిష్టానం జనవరి 11న మూడో జాబితాలో కర్నూలు ఎంపీ స్థానాన్ని ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాంకు కేటాయించింది. ఎంపీగా పోటీ చేయడం ఇష్టం లేని మంత్రి కొంత కాలంపాటు అజ్ఞాతంలోకి వెళ్లారు. సీటు విషయంపై అధిష్టానం ఎంత ప్రయత్నించినా మంత్రి అందుబాటులోకి రాకపోవడంతో కర్నూలు జిల్లా అధ్యక్షుడు, నగర మేయర్ బీవై రామయ్యకు కేటాయించింది.                      


ఇక మిగిలిన నంద్యాల పార్లమెంట్ స్థానంపై ఉత్కంఠ వీడడం లేదు. అభ్యర్థి ప్రకటన విషయంలో వైసీపీ అధిష్టానం ఆలస్యం చేస్తోంది. సిట్టింగ్ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఈ సారి కూడా తనకే టికెట్ కేటాయించాలని అభ్యర్థించారు. అధిష్టానం మాత్రం ఆయన పట్ల సానుకూలంగా స్పందించ లేదు. ఎంపీకి పలు సర్వేలు అనుకూలంగా  లేవని చెబుతున్నారు. . ఎన్నికైనప్పటి నుంచి నేటి వరకు చెప్పుకోదగ్గ ప్రజా కార్యక్రమాలు చేయలేదు. అలాగే తన పార్లమెంట్ పరిధిలో కనీసం సొంతంగా బలమైన క్యాడర్ ను కూడా ఏర్పాటు చేసుకోకపోవడం ఈయనకు మైనస్ గా మారింది.                


ఎంపీ రేసులో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, సినీ నటుడు అలీ, వైసీపీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు ఖాదర్ బాషా, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. అధిష్టానం సినీ నటుడు అలీ కి గాని, వైసీపీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు ఖాదర్ భాషలకు ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. వీరిలో ఆలీ వైపు అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలిసింది.   మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీలో చేరనున్నారని, ఆయనకు నంద్యాల పార్లమెంట్ టికెట్ ఇవ్వనుందనే ఉద్దేశంతో ఆయన చేరిక కోసం వైసీపీ అభ్యర్థి పేరును ఖరారు చేయలేకపోతుందని చెబుతున్నారు. అయితే అంతిమంగా అలీకే ఎక్కువగా అవకాశం ఉన్నట్లుగా అంచనా  వేస్తున్నారు.