మణిపూర్‌లో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ అయిన నేపథ్యంలో అక్కడ ఎన్ఐటీలో చదువుతున్న ఏపీ విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారని, వారిని తక్షణమే రాష్ట్రానికి తీసుకురావాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. మణిపూర్ రాష్ట్రంలో ఏర్పడిన ఘర్షణలతో అత్యవసర పరిస్థితి విధించారు. ఇప్పటికే పరస్పర దాడుల్లో 54 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. చాలా జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. హింసాత్మక ఘటనలను నియంత్రించడానికి కనిపిస్తే కాల్చివేతకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అక్కడున్న తెలుగు విద్యార్థుల పరిస్థితి ఆందోళనలో పడింది.
వివిధ యూనివర్సిటీలు, ఎన్ఐటీల్లో వందలాది మంది ఏపీకి చెందిన విద్యార్థులు ఉన్నారు. వీరి భద్రత విషయమై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో వారిని తక్షణమే రాష్ట్రానికి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులను ప్రత్యేక విమానంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం సురక్షితంగా స్వరాష్ట్రానికి తీసుకొచ్చిందని, ఏపీకి చెందిన విద్యార్థులు వేర్వేరు క్యాంపస్‌లలో బిక్కుబిక్కుమంటూ ప్రాణభయంతో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
బయట కర్ఫ్యూ, కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు, ఇంటర్నెట్ సేవలకి అంతరాయం ఉన్న నేపథ్యంలో ఏపీ సర్కారు ఏర్పాటు చేసిన కాల్ సెంటర్లని విద్యార్థులు ఎలా సంప్రదించగలరని నారా లోకేష్ ప్రశ్నించారు. తక్షణమే సీఎం జగన్ మోహన్ రెడ్డి జోక్యం చేసుకుని ఉన్నతాధికారులు మణిపూర్ ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక విమానంలో మన రాష్ట్ర విద్యార్థులు అందరినీ తరలించేందుకు తక్షణమే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.
91వ రోజు కొనసాగుతున్న లోకేశ్ పాతయాత్ర
మరోవైపు, నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 91వ రోజు కొనసాగుతోంది. నేడు కర్నూలు శివారులోని రేడియో స్టేషన్ విడిది కేంద్రం నుంచి ప్రారంభించారు. కర్నూలు నగరవాసులు ఘనస్వాగతం పలికారు. వార్డుల్లో తాగునీటి సమస్య, డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని కొంత మంది ప్రజలు లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. కర్నూలు 48వ డివిజన్ రోజా దర్గా వద్ద మతపెద్దలు షాయా కప్పి ఫాతియా అందజేశారు. నిరుద్యోగ యువకులు, దివ్యాంగులు, క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, వివిధ బస్తీల వాసులు కలిసి వారి సమస్యలను లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. టిడిపి ప్రభుత్వం వచ్చాక అందరి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కర్నూలు శ్రీనివాస నగర్ లోని స్టాంటన్ స్మారక తెలుగు బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో నారా లోకేశ్ పాల్గొన్నారు.