'లక్ష్యం', 'లౌక్యం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో అలరించిన గోపీచంద్, తాజాగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘రామబాణం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డింపుల్ హయతి హీరోయిన్ గా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మే 5న థియేటర్లలో విడుదల అయ్యింది.  'లక్ష్యం' తర్వాత గోపీచంద్ మరోసారి జగపతి బాబుతో కలిసి నటించడంతో ఆయన ఫ్యాన్స్, ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమా పోస్టర్స్, ట్రైలర్, టీజర్స్ సైతం మరింత ఆసక్తిని కలిగించాయి.  


ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ‘రామబాణం‘


భారీ అంచనాలతో విడుదలైన  ‘రామబాణం‘ సినిమా ఆడియెన్స్ ను ఆకట్టుకోవడంలో పెద్దగా సక్సెస్ కాలేదు. తొలి షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. గోపిచంద్‌కు ఇలాంటి పాత్రలు చేయడం అస్సలు కొత్తేమీ కాదు. భైరవి పాత్రలో కనిపించిన డింపుల్ హయతి నటించడానికి పెద్దగా స్కోప్ లేదు. గోపిచంద్ అన్న పాత్రలో జగపతిబాబు బాగా నటించాడు. జగపతి బాబు, ఖుష్బూ పాత్రల్లో మంచి ఎమోషన్స్ పండాయి. నాజర్, తరుణ్ అరోరా విలన్ పాత్రల్లో నటించారు. మిగతా నటీనటులందరూ పాత్రల పరిధి మేర నటించారు. మొత్తంగా ‘లక్ష్యం‘, ‘లౌక్యం‘ సినిమాలతో వరుసగా రెండు హిట్లు కొట్టిన గోపీచంద్, శ్రీవాస్ కాంబో హ్యాట్రిక్ సక్సెస్ కోసం ఇదే ఫార్ములానే నమ్ముకుంది. ఫార్ములాతో పాటు ట్రీట్‌మెంట్ కూడా పాతదే కావడం ‘రామబాణం’ని గురి తప్పేలా చేసింది. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం నిరాశ పరిచింది. 






ఓటీటీ రైట్స్ దక్కించుకున్న సోనీ లివ్


తాజాగా ‘రామబాణం‘ చిత్రానికి సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లీవ్ దక్కించుకుంది. మరికొద్ది రోజుల్లోనే స్ట్రీమింగ్ వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. థియేటర్లలో పెద్దగా ఆడకపోవడంతో, త్వరలోనే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది. థియేటర్లలో ఆడియెన్స్ ను ఆకట్టుకోలేని ఈ సినిమా, కనీసం ఓటీటీలోనైనా ఆకట్టుకుంటుందేమో చూడాలి.


‘రామబాణం’ సినిమాను  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా టిజి విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు మిక్కీ జె మేయర్ స్వరాలు సమకుర్చారు. ఈ చిత్రంలో కుష్బూ సుందర్, జగపతిబాబు, సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్ మరియు తరుణ్ అరోరా  కీలక పాత్రల్లో నటించారు. భూపతి రాజా ఈ సినిమా కథ రాశారు.






Read Also: ‘పుష్ప 2’లో నిహారిక, గిరిజన అమ్మాయి పాత్రలో మెగా డాటర్ ఫిక్స్?