జగనన్న చేదోడు మూడో విడత నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు బదిలీ చేశారు. వినుకొండ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ ఈ సందర్భంగా విపక్షాలపై ఎప్పటిలాగానే విమర్శలు చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, కొన్ని మీడియా సంస్థలను ఉద్దేశించి మాట్లాడుతూ.. తోడేళ్లన్నీ ఒక్కటవుతున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటువైపు సింహంలా మీ బిడ్డ ఒక్కడే నడుస్తున్నాడని సీఎం జగన్ అన్నారు. మీ బిడ్డకు ఎలాంటి పొత్తుల్లేవని, మీ బిడ్డ వాళ్ల మీద, వీళ్ల మీద నిలబడడని అన్నారు. తోడేళ్లు ఒక్కటవుతున్నా మీ బిడ్డ జగన్ కు భయం లేదని అన్నారు. ఎందుకంటే తాను ప్రజలను, దేవుడిని నమ్ముకున్నానని అన్నారు.
ఇది పేదవాడికి, పెత్తందారుకి మధ్య నడుస్తున్న యుద్ధం అని అన్నారు. మాట ఇస్తే నిలబడే వ్యక్తి ఒక వైపు ఉంటే, వెన్నుపోట్లు, మోసాలు చేసే తోడేళ్లు మరో వైపు ఉన్నాయని అన్నారు. గజ దొంగల పాలన కావాలా? లంచాలు, అవినీతికి చోటు లేని పాలన కావాలా? అని ప్రజల్ని అడిగారు.
గతంలో గజదొంగల ముఠా ఏపీని దోచేశారని వ్యాఖ్య చేశారు. చంద్రబాబును ముసలాయనగా అభివర్ణించారు. అప్పట్లో గజ దొంగల ముఠా ఉండేదని.. కొన్ని మీడియా సంస్థల పేర్లు చెప్పారు. వారితో పాటు చంద్రబాబు, దత్తపుత్రుడు వీళ్లంతా గతదొంగల ముఠా అని అన్నారు. మరి వీళ్లు డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వాళ్ల విధానం డీపీటీ అని.. డీపీటీ అంటే దోచుకో, పంచుకో, తినుకో అని సీఎం జగన్ అన్నారు. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు ఏం చేశాడో చూశారు కదా అని గుర్తు చేశారు.