ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ లండన పర్యటన ముగించుకుని.. రాష్ట్రానికి తిరిగివచ్చారు. లండన్‌లో చదువుతున్న ఇద్దరు కూతుళ్లను కలిసేందుకు శనివారం రాత్రి లండన్‌ వెళ్లిన  జగన్‌ దంపతులు ఈ తెల్లవారుజామున కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో దిగారు. గన్నవరం ఎయిర్‌పొర్ట్‌లో వైఎస్ జగన్‌కు పార్టీ నేతలు స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టులో ఆయన ఫ్లైట్ దిగగానే... మంత్రులు, నేతలు, అధికారులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జోగి రమేష్, పిన్నిపే విశ్వరూప్, కారుమూరి నాగేశ్వరరావు, ప్రభుత్వ విఫ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీ బాలశౌరి, నందిగం సురేష్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి, వల్లభనేని వంశీ, పార్థ సారథి, మల్లాది విష్ణు తదితర నేతలు సీఎంకు పుష్పగుచ్చాలు, బొకేలు ఇచ్చారు. 


ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు సీఎం జగన్‌ బిజీగా ఉండనున్నారు. నేడు రాష్ట్ర పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్ష జరుపుతారు. ముఖ్యనేతలతోనూ సీఎం జగన్ సమావేశం ఉంటుందని సమాచారం. ఇక, రేపు సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. రెండు రోజులు ఢిల్లీలోనే ఉండనున్న సీఎం జగన్‌... ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షాని కలవబోతున్నారు. ఢిల్లీ పర్యటనలో ఈనెల 18 నుంచి జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలపై చర్చిస్తారని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులకు మద్దతు ఇచ్చే అంశంపై ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో చర్చలు జరుపుతారని అంటున్నారు.


చంద్రబాబు అరెస్ట్‌తో.. ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్.. ఏపీలో రాజకీయ పరిణామాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఏపీ సీఎం జగన్.. రాష్ట్రంలో లేనప్పుడు.. చంద్రబాబు అరెస్టు, జైలుకి పంపడం వంటి ఘటనలు జరిగాయి. దీనిపై కూడా కేంద్రం పెద్దలతో మాట్లాడతారని సమాచారం. రాజధాని అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని సీఎం జగన్.. ఢిల్లీ పెద్దలను కోరతారనే ప్రచారం జరుగుతోంది. జమిలి ఎన్నికలు, చంద్రబాబు అరెస్ట్, ఏపీలో తాజా పరిణామాలతో సీఎం ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.