‘‘నిన్నటి తూర్పు - పడమర ద్రోణి ఈరోజు వాయువ్య మధ్యప్రదేశ్ & పరిసర ప్రాంతాల నుండి విదర్భ, దక్షిణ ఛత్తీస్ గఢ్, ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ తీరం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్రమట్టం నుంచి 3.1 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతుంది. ఈ రోజు క్రింది స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి’’ అని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తారు  వర్షాలు కొన్ని చోట్ల, ఎల్లుండి చాలా చోట్ల  కురిసే అవకాశం ఉంది.


ఈనెల 12న మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపారు. 


హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 06 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 28.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.5 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 81 శాతంగా నమోదైంది.


ఏపీలో ఇలా
21° ఉత్తర అక్షాంశం వెంబడి ఉన్న షీయర్ జోన్ (ద్రోణి) ఈరోజు బలహీనపడిందని.. ఈరోజు కింది స్థాయిలోని గాలులు పశ్చిమ, నైరుతి దిశల నుండి ఏపీలోని లోవర్ ట్రోపోస్పిరిక్ లో గాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు.


ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్  & యానాం
ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాల చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. భారీ  వర్షాలు  ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటరువేగముతో వీయవచ్చు. దక్షిణ కోస్తాలో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలో మీటరు వేగముతో వీయవచ్చు.


‘‘బంగాళాఖాతంలో స్థిరంగా ఉపరితల ఆవర్తనం ఉంది. 11న మధ్యాహ్నం నుంచి రాత్రి మధ్యలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులకు అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల మీదుగా బంగాళాఖాతాన్ని ఆనుకొని బలమైన ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని వలన మధ్యాహ్నం నుంచి రాత్రి మధ్య సమయంలో భారీ వర్షాలు, పిడుగులు జిల్లాలైన - శ్రీకాకుళం, పార్వతీపురం మణ్యం, అల్లూరిసీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం జిల్లాలతో పాటుగా విశాఖ నగరం మీదుగా కూడా ప్రభావం చూపనుంది. విశాఖ నగరంలో సాయంకాలం సమయంలో పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలు 100% కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలుంటాయి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.