AP CM Jagan: విభజన హామీలు నెరవేర్చాల్సిందే, కేంద్రంపై వాయిస్ పెంచండి - అధికారులకు సీఎం జగన్ సూచన

YS Jagan Review Meeting: సీఎం జగన్ సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి నేతృత్వంలో జరిగే సమావేశంలో చర్చించాల్సిన అంశాలను వివరించారు. 

Continues below advertisement

Andhra Pradesh Bifurcation Issues:  సీఎం జగన్ (CM YS Jagan) సోమవారం సీఎస్‌ సహా పలువురు అధికారులతో సమీక్ష (Review Meeting) నిర్వహించారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి నేతృత్వంలో జరిగే సమావేశంలో రాష్ట్ర విభజన (State Bifurcation Issues)తో ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)కు జరిగిన నష్టం, చర్చించాల్సిన అంశాలను వివరించారు. విభజన హామీలు, 13వ షెడ్యూల్‌లోని సంస్థల అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనతో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం జరిగిందన్నారు. విభజన జరిగి పదేళ్లు కావొస్తున్నా చట్టంలో పేర్కొన్న అంశాలు అలానే ఉన్నాయని అన్నారు. 

Continues below advertisement

ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని జగన్ చెప్పారు. అప్పుల్లో 58 శాతం ఏపీకి, 42 శాతం తెలంగాణకు కేటాయించారని, కానీ రెవెన్యూ పరంగా 58 శాతం తెలంగాణకు, 42 శాతం ఏపీకి వచ్చిందని వివరించారు. పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రం ఆదాయాలు ఏ రకంగా పెరుగుతాయని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదని, పోలవరానికి నిధుల విడుదలో సమస్యలున్నాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్‌ బకాయిలు కూడా రాలేదని, మరి విభజన కష్టాల నుంచి రాష్ట్రం ఏవిధంగా బయటకు వస్తుందని అడిగారు. పోలవరం, ప్రత్యేక హోదా అంశాలపై కూడా సమావేశంలో దృష్టిపెట్టాలన్నారు.

ఆయన మాట్లాడుతూ.. ‘విభజన వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందనే కదా విభజన చట్టంలో హామీలు ఇచ్చారు. హైదరాబాద్‌ రూపేణా పారిశ్రామిక, రోడ్డు రవాణా, విద్యా సంస్ధల పరంగా ఇలా అన్నిరకాల మౌలిక సదుపాయాలను కోల్పోయాం. దీనివల్ల రాష్ట్రానికి రెవిన్యూ రూపంలో చాలా నష్టపోయాం. దీన్ని సర్దుబాటుచేస్తూ విభజన చట్టంలో ఆయా రంగాలకు సంబంధించి మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు హామీలు ఇచ్చింది. విభజన చట్టంలో ఉన్న ఈ స్ఫూర్తి ఇప్పుడు అమల్లోకూడా కనిపించాల్సిన అవసరం ఉంది. ఇవి నెరవేరితే రాష్ట్రంలో పలు వసతులు సమకూరుతాయి. తద్వారా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటాయి. రెవెన్యూ పెరుతుంది. రాష్ట్రం పురోగమిస్తేనే దేశం కూడా పురోగమిస్తుంది’ అని అన్నారు. 

‘ఇతర రాష్ట్రాలతో  పోలిస్తే ఏపీ పట్ల కేంద్రం తప్పనిసరిగా ప్రత్యేకత చూపించాల్సిన అవసరం ఉంది. అప్పుడే విభజన నష్టాల నుంచి గట్టెక్కగలుగుతుంది. అధికార వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిలో భాగంగా మూడు రాజధానులను ప్రకటించాం. ఈ ప్రాంతాల మధ్య సమతుల్యమైన, సమగ్రమైన అభివృద్ధి మన బాధ్యత. మూడు ప్రాంతాలను అనుసంధానిస్తూ రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పలు రోడ్లు నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో కూడా వీటిని మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సమగ్రమైన సహకారం, సహాయం అవసరం. దీని కోసం సమావేశంలో కేంద్రాన్ని గట్టిగా కోరాలి’ అని అధికారులకు సూచించారు.

సీఎం ఇంకా మాట్లాడుతూ.. ‘కొత్తగా సెంట్రల్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీని కోరుతున్నాం. కచ్చితంగా ఇది వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలి. దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణంపై కేంద్రం హామీ ఇచ్చింది. వీటన్నింటికోసం దీనికోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలి. కడపలో స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రం హామీ ఇచ్చింది. స్టీల్‌ ప్లాంటుకు సమీప ప్రాంతంలో ఎన్‌ఎండీసీ నుంచి గనుల కేటాయింపు చేయాలి.   దీంతో ప్రతిపాదిత ఫ్యాక్టరీ నిర్మాణానికి మార్గం సులభతరం అవుతుంది. విశాఖపట్నం నుంచి రాయలసీమ ప్రాంతానికి అత్యంత వేగంగా నడిచే రైళ్లకోసం హై స్పీడ్‌ రైల్‌ కారిడార్‌ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం –  వయా కర్నూలు మీదుగా కడపకు అత్యంత వేగంగా నడిచే రైళ్లకోసం ఒత్తిడి తీసుకురావాలి. దీనివల్ల మూడు ప్రాంతాల మధ్య రాకపోకలు అత్యంత సులభతరం అవుతాయి’ అని అన్నారు.
    
‘విశాఖ రైల్వే జోన్‌అంశంపై కూడా దృష్టిపెట్టాలి, వైజాగ్, విజయవాడ, తిరుపతి ఎయిర్‌ పోర్టులను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా మారుస్తానన్నారు. విశాఖపట్నంలో నేవీ కార్యకలాపాల వల్ల పౌరవిమానాలకు తీవ్ర ఇబ్బంది వస్తోంది. దీంతో ఎయిర్‌ పోర్టును వేరే చోటకు బదిలీచేయాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం భోగాపురం ఎయిర్‌ పోర్టును నిర్మిస్తున్నారు. ఈ ఎయిర్‌ పోర్టుకు కనెక్టివిటీ చాలా ముఖ్యం. మంచి రహదారి ఏర్పాటుకు కేంద్రం ఇతోధికంగా సహాయం అందించాల్సిన అవసరం ఉంది. విశాఖ సిటీ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు అనుసంధానం చేసే రహదారి అంశంపై కేంద్రంతో జరుగుతున్న సమావేశంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి’ అని సీఎం జగన్ అధికారులకు సూచించారు. 

‘భోగాపురం ఎయిర్‌ పోర్టుకు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భూ సేకరణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. విజయవాడ లాంటి ఎయిర్‌ పోర్టుల్లోనూ భూ సేకరణ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తోంది. విశాఖ మెట్రో రైలు అంశాన్నికూడా కొలిక్కి తీసుకురావాలి. ప్రైవేట్‌ డెవలపర్‌ 60 శాతం భరిస్తున్నందున, భూ సేకరణ సహా మిగిలిన 40 శాతం కేంద్రం భరించేలా గట్టిగా ఒత్తిడి తీసుకురావాలి. రెండు రాష్ట్రల మధ్య ఆస్తుల విభజన ఇంకా పెండింగ్‌లో ఉంది. దీని కోసం ఒత్తిడి తీసుకురావాలి. వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై కూడా దృష్టిపెట్టాలి’ అని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. 

Continues below advertisement
Sponsored Links by Taboola