అనంతపురం: సింహం బయటకు వచ్చింది, ఇక జనంలోకి రావడం ఆలస్యం అంటూ చంద్రబాబుకు బెయిల్ పై ఏపీ మాజీ మంత్రి పరిటాల సునీత స్పందించారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసు (Skill Development Case)లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రెగ్యులర్ బెయిల్ రావడంతో అనంతపురం జిల్లా వ్యాప్తంగా టిడిపి నేతలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. కళ్యాణదుర్గం బైపాస్ లో మాజీ మంత్రి పరిటాల సునీత (Paritala Sunitha) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం చంద్రబాబు (Chandrababu) చిత్రపటం ముందు టెంకాయలు కొట్టి, అనంతరం కేకును కట్ చేశారు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు పరిటాల సునీత పాల్గొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు రెగ్యూలర్ బెయిల్ ఇవ్వడంతో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ప్రోగ్రాంలోనే పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ.. చంద్రబాబుకి రెగ్యులర్ బెయిల్ రావడం ఎంత ఆనందంగా ఉందన్నారు. మచ్చలేని నాయకుడి పై అన్యాయంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టి ఈ వయసులో చంద్రబాబుని ఎంతో ఇబ్బంది పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని ఈనెల 28వ తేదీ నుంచి సింహం బయటకు వస్తుందని.. ఆ సింహం ఇక జనంలోకి రావడమే ఆలస్యం అన్నారు.
చంద్రబాబు తప్పు చేసే వ్యక్తి కాదని ఎప్పుడూ కూడా న్యాయం కోసం పోరాడే తత్వం ఉన్న నేత అని అన్నారు. పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే సహించేవారు కాదని అలాంటిది ఆయన్ని ఒక తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించేందుకు జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలు ఎంత ప్రయత్నించారాణి అలాంటివేమీ చంద్రబాబుని ఏమీ చేయలేమన్నారు.
స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అదినేత చంద్రబాబుకు (Chandrababu) భారీ ఊరట లభించింది. ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అనారోగ్య కారణాలతో ఈ కేసులో ఇప్పటికే మధ్యంతర బెయిల్ పై ఉన్న చంద్రబాబుకు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జున్ రావు తీర్పు వెలువరించారు. ఈ నెల 28న చంద్రబాబు రాజమహేంద్రవరం జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో విధించిన షరతులు ఈ నెల 28 వరకే వర్తిస్తాయని, 29 నుంచి రాజకీయ ర్యాలీలు, సభలు, ప్రెస్ మీట్లలో చంద్రబాబు పాల్గొనవచ్చని న్యాయమూర్తి తెలిపారు.
ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరు కావాలని ఆదేశించారు. చికిత్సకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టులో అందించాలని సూచించారు. సెప్టెంబర్ 9న స్కిల్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేయగా పలుమార్లు బెయిల్ పై విచారణలు వాయిదా పడ్డాయి. అనంతరం, అనారోగ్య కారణాల రీత్యా ఆయనకు చికిత్స కోసం అక్టోబర్ 31న 4 వారాల మధ్యంతర బెయిల్ హైకోర్టు మంజూరు చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం చంద్రబాబు షరతులతో కూడిన బెయిల్ పై బయట ఉండగా పూర్తి బెయిల్ మంజూరైంది.