Ukraine Telugu Students: ఉక్రెయిన్(Ukraine) పై రష్యా(Russia) దాడి కొనసాగుతోంది. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల(Indians)ను తరలించేందుకు విదేశాంగ శాఖ ప్రయత్నాలు చేస్తుంది. ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను క్షేమంగా తీసుకురావాలని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్(Jayashankar) కు సీఎం జగన్(CM Jagan) ఫోన్ చేశారు. విద్యార్థులను క్షేమంగా తీసుకురావాలని కోరారు. తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. కేంద్రం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి జయశంకర్ సీఎం జగన్ కు తెలిపారు. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు భారతీయులను తరలించి అక్కడ నుంచి ప్రత్యేక విమానాల ద్వారా దేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకొచ్చే దిశగా ముమ్మర చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
సీఎం జగన్(CM Jagan) ఉన్నతస్థాయి సమావేశం
అంతకుముందు సీఎం జగన్ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుచేశారు. ఉన్నతస్థాయి సమావేశంలో సీఎస్(CS), సీఎంఓ అధికారులు, సలహాదారు జితేష్ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్రస్థాయిలో ఇప్పటివరకూ తీసుకున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. కలెక్టరేట్ స్థాయిలో కాల్‌సెంటర్ల ఏర్పాటుకు సీఎం ఆదేశించారు. రాష్ట్రానికి చెందిన ప్రతి ఒక్కరితో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. విద్యార్థుల యోగక్షేమాలను కనుక్కుంటూ వారి భద్రతకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఎప్పటికప్పుడు వారితో సంప్రదిస్తూ తగిన మార్గనిర్దేశం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వాధికారులకు అవసరమైన సమాచారాన్ని అందించాలన్నారు. అక్కడున్న తెలుగువారి నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా దాన్ని విదేశాంగశాఖ అధికారులకు చేరవేయాలన్నారు. అవసరమైతే ప్రత్యేక విమానాల ద్వారా తరలింపులో రాష్ట్రం నుంచి తగిన సహకారం అందించాలన్నారు.
ఎంపీ విజయసాయిరెడ్డి(Vijaysai Reddy)ని కలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు
ఉక్రెయిన్ లో చిక్కుకున్న విశాఖకు చెందిన విద్యార్థులను సురక్షితంగా తిరిగి రప్పించాలని ఎంపీ విజయసాయిరెడ్డి(MP Vijayasai Reddy)ని శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులు కలిశారు. విద్యార్థులు, ఎంబసీతోనూ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని ఎంపీ తెలిపారు. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కు సీఎం జగన్ లేఖ రాయడంతో పాటు ఫోన్ చేసి విద్యార్థులను సురక్షితంగా రప్పించాలని కోరారన్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున ఈ విషయంపై స్పష్టమైన హామీ కూడా లభించిందన్నారు. తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. ఎంపీని కలిసిన వారిలో సబ్బవరంకి చెందిన తరుణ్ తండ్రి శ్రీనివాస్, పెందుర్తికి చెందిన యోగేష్ తల్లి ఆశాజ్యోతి, రాంపురానికి చెందిన శ్రీజ తండ్రి అర్జున్ రెడ్డి ఉన్నారు.