CM Jagan Review : గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీకి సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఖాళీలను భర్తీ చేయటానిక అవసరం అయిన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.ఇప్పటికే జరిగిన నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టారని దీంతో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందని జగన్ అధికారులను ప్రశంసించారు.తాడేపల్లిలోని క్యాంప్ కార్యలయంలో సీఎం జగన్ గ్రామ వార్డు సచివాలయాల పై సమీక్ష నిర్వహించారు. సచివాలయాల్లో సమగ్ర పర్యవేక్షణ, సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనలో సచివాలయాల కీలక పాత్ర, సచివాలయాల్లో ఏర్పడ్డ ఖాళీల భర్తీ వంటి అంశాల పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా గ్రామ, వార్డు సచివాయాలను ఏర్పాటు చేశామని,చివరి స్థాయి వరకూ సమర్థవంతమైన డెలివరీ మెకానిజమే లక్ష్యంగా సచివాలయాలను ఏర్పాటు చేసిన విషయాన్ని జగన్ ప్రస్తావించారు.
సచివాలయాల వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలని జగన్ ఆకాంక్షించారు.సరైన ఎస్‌ఓపీలు, పర్యవేక్షణ లేకపోతే ప్రయోజనం ఉండదు కాబట్టి ఆదిశగా పని తీరు ఉండాలని జగన్ అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మధ్యాహ్నం 3 గంటలనుంచి 5 గంటలవరకూ స్పందన నిర్వహించాలన్నారు.ప్రభుత్వ విభాగాల వారీగా మండలాల స్థాయిలో పర్యవేక్షణ ఉండాలని,రిపోర్టింగ్ స్ట్రక్చర్ పటిష్టంగా ఉండాలని సూచించారు.గ్రామ వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న సిబ్బంది పై విభాగాల వారీగా మండల స్థాయిలో పర్యవేక్షణ ఉండాలని,విధులు, బాధ్యతల పై ఎస్‌ఓపీలు రూపొందించి ,వాటిని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.
అర్జీల పరిష్కారం కూడా చాలా ముఖ్యమయ్యిందని,వాటి పరిష్కారంలో జాప్యం, నిర్లక్ష్యం ఉండకూడదని జగన్ స్పష్టం చేశారు. ఒకే అర్జీ మళ్లీ వచ్చినప్పుడు మళ్లీ అదే వ్యవస్థ దాన్ని పరిశీలించే బదులు, ఆ పై వ్యవస్థ పరిశీలన చేసి లోటు పాట్లను సరిచేసి, పరిష్కరిస్తే ఫలితాలు ఉంటాయని జగన్ అభిప్రాయపడ్డారు. అయితే ఇలాంటి అంశాల పై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు.అలాంటప్పుడే గ్రామ, వార్డు సచివాలయాలు సమర్థవంతంగా పని చేయగలుగుతాయని,అధికారులు ఓనర్‌షిప్ తీసుకోవటం,ద్వారానే ఇవి ఫలిస్తాయని ఆకాంక్షించారు.
ప్రభుత్వ శాఖాధిపతులు ప్రతి నెల ఖచ్చితంగా రెండు సచివాలయాలను తప్పనిసరిగా సందర్శించాలని జగన్ ఆదేశాలు ఇచ్చారు. దీని వల్ల వాటి సమర్థత పెరుగుతుందని, సచివాలయాల స్థాయిలో మెరుగైన సేవలు అందుతుందనే విశ్వాసం ప్రజల్లో పెంపొందించగలమని అన్నారు. ప్రభుత్వంలో సమర్థవంతమైన ఉద్యోగులు ఉన్నారని, వారి సేవలు ప్రజలకు అందినప్పుడు, ప్రజలకు అన్నిరకాలుగా ఉపయోగం, అనుకున్న లక్ష్యాలను కూడా సాధించగలుగుతామని జగన్ అభిప్రాయపడ్డారు. సిబ్బందితో సమన్వయం కోసం, వారు అందుబాటులో ఉండేలా మెరుగైన విధానాలను అవలంభించాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించుకోవటం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రదాన లక్ష్యమని తెలిపారు.
ప్రతి ప్రభుత్వ విభాగంలో ఫేషియల్ రికగ్నైజేషన్‌తో కూడిన హాజరును అమలు చేయాల్సిందేనని జగన్ స్పష్టం చేశారు.ప్రభుత్వ శాఖాధిపతుల నుంచే ఇది అమలు అయితే కింది స్థాయిలో కూడా అందరూ అమలు చేస్తారని, దీని వల్ల సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజల వినతులకు సంబంధించిన పరిష్కారం పై దృష్టిపెట్టేందుకు వీలుంటుందని అన్నారు.లేనిపక్షంలో అంతిమంగా ఇబ్బందులు పడేది ప్రజలన్న విషయాలను గుర్తించాలన్నారు.సుస్థిర ప్రగతి లక్ష్యాల పై గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి అవగాహన కల్పించాలని,అప్పుడే ఆ లక్ష్యాలను అందుకోగలమని జగన్ పేర్కొన్నారు.