AP Cabinet Meet Inside :  ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్న తర్వాత మంత్రులతో సీఎం జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా ముందస్తు ఎన్నికలంటూ బయట జరుగుతున్న ప్రచారాన్ని కొంత మంది మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అయితే షెడ్యూల్ ప్రకారమే  ఎన్నికలకు  వెళ్ళనున్నట్టుగా   జగన్  వారికి తేల్చి  చెప్పారు.  ముందస్తు  ఎన్నికలకు  జగన్ వెళ్లే  అవకాశం ఉందని జరుగుతున్న ప్రచారం అంతా రాజకీయమేనని.. పట్టించుకోవద్దని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఎన్నికలు మరో తొమ్మిది నెలల్లో ఉన్నాయని..  కష్టపడితే  మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని మంత్రులకు  జగన్   తెలిపారు.  తొమ్మిది నెలల పాటు కష్టపడండి.. మిగిలినది తాను చూసుకుంటానని మంత్రులకు జగన్ భరోసా ఇచ్చారు. 


టీడీపీ మేనిఫెస్టో పై స్పందించాల్సిన అవసరం లేదన్న సీఎం జగన్                            


చంద్రబాబు మేనిఫెస్టో విషయంలో ఎవరూ స్పందించవద్దని సీఎం జగన్ సూచించినట్లుగా తెలుస్తోంది. వైసీపీ నేతలే ఎక్కువగా స్పందించడంతో వారే మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారన్న అభిప్రాయం వినిపించడంతో ఇక స్పందించవద్దని చెప్పినట్లుగా తెలుస్తోంది. మరో వైపు  బీజేపీ, జనసేన , టీడీపీ కలిసి కూటమిగా ఏర్పడబోతున్నాయన్న ప్రచారంపైనా జగన్ స్పందించినట్లుగా తెలుస్తోంది. వారంతా కలిసి వచ్చినా వార్ వన్ సైడేనని జగన్ ధీమా వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. 


తెలంగాణతో పాటే అసెంబ్లీ ఎన్నికలకు  వెళ్లే అవకాశం లేనట్లే                        


తెలంగాణతో పాటే ఏపీలోనూ ముందస్తు ఎన్నికలకు వెళతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ కూడా..  వేగంగా పథకాలను అమలు చేసి. వెళ్లాలని అనుకున్నట్లుగా భావించారు. దానికి తగ్గట్లుగానే గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఉద్ధృతంగా నిర్వహించారు.అయితే ఇటీవల ఆ కార్యక్రమం వేగం తగ్గింది. సీఎం జగన్ కూడా పెద్దగా సమీక్షలు చేయడం లేదు.  అప్పటి వరకూ ముందస్తు ఆలోచన చేసినా ఇప్పుడు పూర్తిగా వెనక్కి తగ్గి పార్లమెంట్ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలకూ వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా భావిస్తున్నారు. 


మంత్రుల పనితీరు విషయంలో వ్యతిరేక కామెంట్లు చేయని సీఎం జగన్                           


మరో వైపు గతంలో ఎప్పుడు కేబినెట్ సమావేశాలు జరిగినా మంత్రులకు జగన్ వార్నింగ్ లు ఇచ్చేవారు. ఈ సారి అలాంటిదేమీ లేదని తెలుస్తోంది. గతంలో ముగ్గురు, నలుగురు మంత్రుల్ని మార్చేస్తానని చెప్పేవారు. కేబినె్ట విస్తరణ కూడా ఉంటుందని అనుకున్నారు.కానీ ఈ సారి మాత్రం మంత్రులు ఎవర్నీ మందలించలేదని చెబుతున్నారు.  సీఎం జగన్ తీరును బట్టి చూస్తే.. ఇక మంత్రి వర్గంలో మార్పు చేర్పులు కూడా ఉండవని ప్రస్తుతం ఉన్న టీమ్ తోనే ఎన్నికలకు వెళ్తారన్న అభిప్రాయానికి ఇతర మంత్రులు కూడా వచ్చారు. సీఎం జగన్ లో వచ్చిన మార్పు చాలా మంది మంత్రులను ఆశ్చర్యపరిచింది.