YSRCP Fourth List : వైఎస్ఆర్‌సీపీ అధినేత సీఎం జగన్ నాలుగో జాబితాపై దృష్టి పెట్టారు. 25వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలనుకుంటున్న ఆయన ఈ లోపే అభ్యర్థలపై కసరత్తు పూర్తి చేయాలనుకుంటున్నారు. అందుకే నాలుగవ జాబితా కోసం వైసీపీ అధినాయకత్వం తుది కసరత్తు ప్రారంభించింది. లువురు ఎమ్మెల్యేలు, నేతలు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఇప్పటికే పలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జీల మార్పులపై సీఎం కసరత్తు ఆరంభించారు. పలువురు ఇన్చార్జీల మార్పుతో నాలుగో జాబితాను సిద్దం చేస్తున్నారు.
మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను సీఎంవో కార్యాలయానికి పిలిపించారు. ఆమె ను జగ్గయ్యపేట అభ్యర్థిగా నిలబెడతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన ఖండించారు. కానీ వైసీపీ నాయకత్వం మాత్రం ఆయనపై నమ్మకం పెట్టుకోలేక ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని రెడీ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వాసిరెడ్డి పద్మ జగ్గయ్యపేటకు చెందిన వారు కావడంతో అక్కడ ఆమెకు పోటీ చేసే అవకాశం కల్పించాలని ఆలోచిస్తున్నారు. మరో వైపు సీఎంవోకు మంత్రి అంబటి రాంబాబుతో పాటు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలు వచ్చారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలు నియోజకవర్గాల పార్టీ ఇన్ చార్జీల మార్పులపై సీఎం కసరత్తు చేస్తున్నారు. ఇక, పలువురు ఎమ్మెల్యేలు, నేతలకు సీఎం జగన్ నుంచి పిలుపు వచ్చింది. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. వీరి ఇరువురి సమావేశంలో కందుకూరు నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జిని మారుస్తున్నట్లుగా జగన్ చెప్పారని అంటున్నారు. కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన యాదవ్ కూడా సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. కనిగిరి నియోజకవర్గానికి కదిరి బాబూరావును ఇంచార్జ్ గా నియమించే అవకాశం ఉంది.
మార్కాపురం నియోజకవర్గం పార్టీ ఇన్ చార్జి మార్పుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. సీఎం జగన్ ను మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి కలిశారు. మార్కాపురం నియోజకవర్గ ఇన్ చార్జిగా మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి పేరును దాదాపు సీఎం ఖరారు చేశారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డిని పిలిపించి జగన్ మాట్లాడారు. దీనికి సంబంధించి సీఎం క్యాంపు కార్యాలయానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా వచ్చారు. కొన్ని చోట్ల ఎంపీ అభ్యర్ధులను వైసీపీ అధినాయకత్వం ప్రకటించింది. నాలుగవ జాబితాలో తొమ్మిది మంది ఎంపీ అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉందని టాక్. ఈ మేరకు ముమ్మరంగా వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తుంది.
నాలుగో జాబితానే ఫైనల్ అని.. మరో జాబితా ఉండదని వైసీపీ వర్గాలు చెబుతున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఉన్న వారే అభ్యర్థులుగా ఉంటారని అంచనా వేస్తున్నారు.