AP PCC chief Sharmila :  వైఎస్ షర్మిల ఆషామాషీగా ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టాలని అనుకోవడం లేదు. మొదటి అడుగులోనే తనదైన ముద్ర వేయాలనుకుంటున్నారు. భారీ బలప్రదర్శన చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. 21వ తేదీన ఇడుపులపాయలో వైఎస్ఆర్ సమాధి సందర్శించి బాధ్యతలు తీసుకోనున్నారు షర్మిల. కడపకు వెళ్లే సమయంలో భారీ బలప్రదర్శన చేయనున్నారు.


ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఎంపికైన షర్మిల.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ నెల 21న బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధం చేసుకుంటున్నారు.  వైఎస్ఆర్ స్మృతివనం దగ్గరికి వెళ్లి వైఎస్ ఘాట్ కి నివాళి అర్పించిన తర్వాత బాద్యతలు చేపట్టనున్నారు.  ఒక్క కడప జిల్లా నుంచే కాకుండా పక్కనే ఉన్న కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి కూడా భారీగా జనసమీకరణ చేయటానికి, భారీ ప్రదర్శనగా వైఎస్ఆర్ సమాధి దగ్గరికి వెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు షర్మిల.పీసీసీ అధ్యక్షురాలిగా ఎంపికయ్యాక మొదటి కార్యక్రమానికి భారీ జనసమీకరణ చేపట్టాలనే నిర్ణయానికి షర్మిల వచ్చారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అనుచరులకు సూచించారు. 


కాంగ్రెస్ పార్టీకి  వైఎస్ఆర్  చేసిన సేవ, కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎదిగిన విధానం, ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఏ విధంగా ఎదిగారు? ఎంతమందిని రాజకీయపరంగా పైకి తీసుకొచ్చారు? అనే అంశాలను మరోసారి షర్మిల గుర్తు చేసుకునే అవకాశం ఉంది. వైఎస్ పూర్తిగా కాంగ్రెస్ పార్టీకే అంకితమయ్యారని చె్పపేలా  షర్మిల  యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. వారితో కలిసి ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా అడుగులు వేయటానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు షర్మిల.                                    


వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా షర్మిల తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. నిజానికి వైఎస్ పూర్తి కాలం కాంగ్రెస్ లో ఉన్నారు. ఆయనను హైకమాండ్ ప్రోత్సహించింది. ఆయన కూడా హైకమాండ్ కు ఎప్పుడూ వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడే ఆయన ప్రమాదంలో చనిపోయారు. కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకోవడంతో హైకమాండ్ కు వైఎస్ వ్యతిరేకం అన్నట్లుగా ఓ ఇమేజ్ క్రియేట్ అయింది. కాంగ్రెస్ - .. వైఎస్‌ను వేధించిందన్నట్లుగా ప్రచారం అయింది. ఇప్పుడు ఆ ఇమేజ్ ను మార్చాలని.. వైఎస్ కాంగ్రెస్ సొంతమని.. రాహుల్ ను సీఎంను చేయడం ఆయన జీవిత లక్ష్యమని ఆ లక్ష్యం దిశగానే తాను పయనిస్తున్నానని చెప్పే అవకాశం ఉంది.