YSRCP News :  వైఎస్ఆర్‌సీపీలో అంతర్గత విబేధాలు అంతకంతకూ పెరిగిపోతూండటంపై సీఎం జగన్ దృష్టి  పెట్టారు.  టిక్కెట్ల కోసం రేసులో  ఉన్న నేతలు నియోజకవర్గాల్ని పంచుకుంటున్నారు. తాము పోటీ చేస్తామంటే.. తాము పోటీ చేస్తామని ప్రకటిస్తున్నారు. అాలాగే  డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం వైసీపీలో కూడా మంత్రి చెల్లుబోయిన  వేణుగోపాల కృష్ణ, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ మధ్య రగడ ప్రారంభమయింది. ఇది  దాడుల వరకూ దారి తీయడం.. పిల్లి సుభాష్ పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతున్న సమయంలో హైకమాండ్ అప్రమత్తమయింది. గోదావరి జిల్లా ఇంచార్జ్ గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి ఇటీవల మూడు రోజుల పాటు గోదావరి జిల్లాల్లో ఉన్నప్పటికీ సుభాష్ ఆయనను కలిసేందుకు రాలేదు. దీంతో పరిస్థితి చేయి దాటకుండా సీఎం జగన్ ఆయనతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. 


సీఎం క్యాంప్ ఆఫీసుకు వచ్చిన పిల్లి సుభాష్ 
 
వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు పిలుపు వచ్చింది.  ముందుగా పిల్లి సుభాష్  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయ్యారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వ్యవహార శైలిపై ఫిర్యాదు చేశారు. అదే సమయంలో గోదావరి జిల్లా ఇంచార్జ్ ఎంపీ మిథున్ రెడ్డి కూడా సీఎం జగన్ ను కలిశారు. అంతే కాదు రామచంద్రాపురం నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను వివరించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి మరికాసేపట్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అవుతారు.   కొన్ని రోజులుగా రామచంద్రాపురం నియోజకవర్గం వైసీపీ రెండు గ్రూపులుగా విడిపోయింది. బోస్ వర్గం..వేణు వర్గంగా వైసీపీ విడిపోయి వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. 


రామచంద్రాపురం టిక్కెట్ తన కుమారుడికే ఇవ్వాలంటున్న పిల్లి సుభాష్ 


వచ్చే ఎన్నికల్లో టికెట్ విషయంలో ఈ అసమ్మతి భగ్గుమంది. రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పోటీ చేస్తారని వైసీపీ ఎంపీ, రీజినల్ కో ఆర్డినేటర్ మిథున్ రెడ్డి ప్రకటించారు. అయితే వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి బోస్ తనయుడు సూర్యప్రకాశ్ ను బరిలోకి దించాలని యోచనలో ఉన్నారు. అయితే వైసీపీ అధిష్టానం వేణుకు టికెట్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో బోస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని సూర్యప్రకాశ్‌కు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని తీర్మానించారు. సూర్యప్రకాశ్‌ను కాదని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని శపథం చేశారు. 


దాడులతో రచ్చ కావడంతో సీఎం జోక్యం 


బోస్ అనుచరులు ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లిన రామచంద్రాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ శివాజీని మంత్రి అనుచరులు దాడి చేశారు. దాడి జరిగినప్పుడు మంత్రి వేణు పక్కనే ఉన్నప్పటికీ వారించే ప్రయత్నం చేయలేదు. తనపై మంత్రి వేణు వర్గీయులు దాడి చేయడంతో మనస్తాపం చెందిన శివాజీ ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో నియోజకవర్గం వైసీపీలో విబేధాలు మరింత రచ్చకెక్కాయి.  ఈ అసమ్మతికి చెక్ పెట్టి బోస్‌ను బుజ్జగించాలని హైకమాండ్ నిర్ణయించుకుంది.