Gas Leak Case : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లో గ్యాస్ లీక్ వ్యవహారంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. బాధితులకు అందుతున్న వైద్య సహాయంపై ఆయన ఆరా తీశారు. గ్యాస్ లీక్ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని ఘటనపై ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేయాలని సీఎం ఆదేశించారు. కారణాలను వెలికితీయడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటివి జరక్కుండా తీసుకోవాల్సిన చర్యలపైనా దృష్టిపెట్టాలని ఆదేశించారు. దీంతో పాటు రాష్ట్రంలోని అన్ని పరిశ్రమల్లో కూడా సేఫ్టీ ఆడిట్ జరిపించాలని సీఎం ఆదేశించారు.
కార్మికుల ప్రాణాల్ని రిస్క్‌లో పెడుతున్న కంపెనీ
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ సీడ్స్ కంపెనీలో విషవాయువు రెండోసారి లీకయింది. దీంతో తక్షణమే సీడ్స్ కంపెనీని మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఫ్యాక్టరీ తెరవకూడదని ఆదేశించింది. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహరెడ్డి ఆదేశించారు. గతంలో జరిగిన విష వాయువు లీకేజీపై విచారణ జరుగుతుండగా మరోసారి ప్రమాదం జరగడం పై మంత్రి గుడవాడ అమర్నాథ్ స్పందించారు. జరిగిన ప్రమాదానికి సీడ్స్ కంపెనీయే బాధ్యత వహించాలన్నారు.
గతంలో లీకయినా చర్యల్లేవు.. మళ్లీ అదే తరహాలో కార్మికుల ప్రాణాల మీదకు తెచ్చిన యజమాన్యం
విషవాయువు లీకేజీ సంఘటనలో గాయపడిన బాధితులను ఎన్టీఆర్ ప్రభుత్వ హాస్పిటల్‌లో మంత్రి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సీడ్స్ యూనిట్‌లో 121 మంది అస్వస్థతకు గురైనట్లు మంత్రి అమర్‌నాథ్ తెలిపారు. అస్వస్థతకు గురైన వారిని అయిదు ఆసుపత్రుల్లో జాయిన్ చేశామని, బాధితుల్లో ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపారు. బాధితుల చికిత్సకు ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. కాంప్లెక్స్ రసాయనాలు ఉన్నట్లు ప్రాథమిక నివేదికలో తేలిందన్నారు. జరిగిన ప్రమాదంపై నమూనాలను ఐసీఎమ్‌ఆర్‌కు పంపుతున్నట్లు చెప్పారు.
ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఇచ్చే వరకూ ఫ్యాక్టరీ మూసివేయాలన్న ప్రభుత్వం
ప్రస్తుత ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ విచారణకు ఆదేశించామని తెలిపారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర స్థాయిలో ఉన్న పరిశ్రమలు అన్నింటిపైన సేఫ్టీ అడిట్ జరుగుతుందని ప్రకటించారు. గత ప్రమాదంలో క్లోరిఫైపాలిష్ అనే రసాయనాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని, దీనిపై సీడ్స్ కంపెనీకి నోటీసులు కూడా జారీ చేశామన్నారు. ప్రస్తుత గ్యాస్‌లీక్‌కు కారణం ఏమిటో తేల్చేందుకు కమిటీ నియమించామన్నారు. నివేదిక వచ్చిన తర్వాతనే మళ్లీ ఫ్యాక్టరీ తెరిచే అంశంపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.