CM Chandrababu Retweet On PM Modi Tweet Of Araku Coffee: అరకు కాఫీ రుచి అద్భుతం అంటూ ప్రధాని మోదీ (PM Modi) చేసిన ట్వీట్‌పై సీఎం చంద్రబాబు (CM Chandrababu) స్పందించారు. 'మీతో మరోసారి అరకు కాఫీ తాగేందుకు ఎదురుచూస్తున్నా' అంటూ రీట్వీట్ చేశారు. అరకు కాఫీని గిరిజన సోదరీమణులు ప్రేమ, భక్తితో పండిస్తారని తెలిపారు. 'ఇది స్థిరత్వం, గిరిజన సాధికారత, ఆవిష్కరణల సమ్మేళనాన్ని సూచిస్తుంది. రాష్ట్ర ప్రజల అపరిమిత సామర్థ్యానికి ఇది ప్రతిబింబం. 2016లో మనం అరకు కాఫీ తాగుతున్న ఫోటోలను షేర్ చేసినందుకు, అరకు కాఫీకి ప్రచారం కల్పిస్తున్నందుకు థ్యాంక్యూ మోదీ గారూ. మీతో మరో కప్ కాఫీ తాగుతూ ఎంజాయ్ చేయాలని ఎదురుచూస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు.
'ఆ క్షణం గుర్తుంది'
భారతదేశ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని అలాంటి వాటిలో ఏపీలోని అరకు కాఫీ ఒకటని ప్రధాని మోదీ అన్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి మన్ కీ బాత్‌లో ఆదివారం ప్రసంగించిన ఆయన పలు ఆసక్తికర అంశాలు చర్చించారు. అరకు కాఫీపై ప్రశంసల జల్లు కురిపించారు. విశాఖ పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబుతో అరకు కాఫీ రుచి చూసినట్లు గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు చంద్రబాబుతో అరకు కాఫీ తాగుతున్న ఫోటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. అక్కడి గిరిజనులు సంస్కృతి, ఆచారాలు వదులుకోకుండా జీవించడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఈ సందర్భంగా అరకు కాఫీ ప్రత్యేకతను ఎలా కాపాడుకుంటున్నారో వివరించారు. కాఫీ ప్రియులందరికీ ఎంతో రుచికరమైన పొడిని అందిస్తున్నారని ప్రశంసించారు. అక్కడి కాఫీ తోటల్ని ఆక్రమించేందుకు వచ్చిన వాళ్లతో గిరిజనులు పోరాటం చేసిన తీరుని సైతం ప్రస్తావించారు. అరకు కాఫీకి ఢిల్లీలో జరిగిన జీ20 సమ్మిట్‌లోనూ ప్రశంసలు దక్కాయని.. ఈ కాఫీ సాగుతో గిరిజన సాధికారత ముడిపడి ఉందని అన్నారు. ప్రపంచలోని కాఫీ ప్రియులు, ఏపీలోని అరకు నుంచి వచ్చే కాఫీని రుచి చూడాలని ట్వీట్‌లో పిలుపునిచ్చారు.
ఇదీ ప్రత్యేకత
దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు కాఫీని ఉత్పత్తి చేస్తున్నాయి. ఏపీలోని అల్లూరి జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో కాఫీ తోటలు సాగవుతున్నాయి. సేంద్రీయ పద్ధతుల్లో పండించడం ద్వారా అరకులో అత్యంత నాణ్యమైన కాఫీ గింజలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ కాఫీకి అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు ఉంది. సముద్ర మట్టానికి 3,600 ఎత్తులో గిరిజన కుటుంబాలు సంప్రదాయ రీతిలో కాఫీ పండిస్తున్నారు. ఈ కాఫీ గింజలను ప్రైవేట్ వ్యాపారులతో పాటు గిరిజన సహకార సంస్థ సేకరిస్తుంది. వీటిలో కొంత మొత్తాన్ని ఈ వేలం ద్వారా అమ్మకాలు చేయగా.. మరికొన్నింటిని అరకు వ్యాలీ కాఫీ పేరుతో మార్కెటింగ్ చేస్తుంది. ఇక్కడి కాఫీ రుచికి పర్యాటకులతో పాటు అంతా ముగ్ధులవుతారు.
Also Read: CM Chandrababu: 'సీఎం చంద్రబాబును కలిసి వినతులు ఇవ్వొచ్చు' - టోల్ ఫ్రీ నెంబర్ ఇదే!