Toll Free Number For Public Requests: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యల పరిష్కారంపై ఎక్కువ దృష్టి పెట్టింది. సీఎం చంద్రబాబుకు వినతులు ఇచ్చేందుకు ఉండవల్లిలోని నివాసానికి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా మంత్రి నారా లోకేశ్ సైతం ప్రజా దర్బార్‌లా నిర్వహిస్తూ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ఇటీవల తనకు వినతులు ఇచ్చేందుకు వచ్చిన ప్రజలను చూసిన పవన్ కల్యాణ్.. కాన్వాయ్ ఆపి చెట్టు కిందే కుర్చీలో కూర్చుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు వాటిని చెప్పి పరిష్కారమయ్యేలా చేశారు. అటు, మంగళగిరిలో మంత్రి నారా లోకేశ్ సైతం ప్రజాదర్భార్ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ వందల సంఖ్యలో ప్రజలు ప్రజాదర్బార్‌కు తమ సమస్యలను లోకేశ్ దృష్టికి తీసుకువస్తున్నారు. వీటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా లోకేశ్ చర్యలు చేపడుతున్నారు. 


టోల్ ఫ్రీ నెంబర్






అయితే, సీఎం చంద్రబాబుకు ప్రజల నుంచి భారీగా వినతులు వస్తున్న క్రమంలో ఓ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎంకు వినతులు ఇచ్చేందుకు జనం పోటెత్తుతున్నారని.. వినతుల స్వీకరణ సులభతరం చేసేలా.. ఫిర్యాదుదారులకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు ఈ నెంబర్ అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. ప్రజలు వారి సమస్యలను 7306299999 కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. ప్రాధాన్యతను బట్టి ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


పెంచిన పింఛన్ల పంపిణీ






ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే పెంచిన పింఛన్లు సోమవారం నుంచి పంపిణీ చేస్తామని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేస్తారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ పింఛన్ దారుల్ని మభ్యపెట్టారని విమర్శించారు. గత ఐదేళ్లలో రూ.వెయ్యి పెంచి హడావుడి చేశారని.. చంద్రబాబు ఒకేసారి రూ.వెయ్యి పెంచి.. వాటిని ఏప్రిల్ నెలతో పాటు కలిపి ఇస్తున్నారని అన్నారు. సోమవారం పెనుమాక గ్రామంలో ఉదయం 6 గంటలకు సీఎం చంద్రబాబు స్వయంగా పెన్షన్లు అందిస్తారని వివరించారు. రాజధాని అమరావతిని త్వరితగతిన పూర్తి చేస్తామని.. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.


Also Read: AP Pensions: ఏపీలో పింఛన్‌దారులకు గుడ్ న్యూస్, కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు