CM Chandrababu Key Orders In Collectors Conference: రాష్ట్రంలో చాలామంది అనర్హులకు పింఛన్లు వెళ్తున్నాయన్న మంత్రి నాదెండ్ల వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) స్పందించారు. రానున్న 3 నెలల్లో ప్రతీ పింఛన్‌ను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని అన్నారు. సచివాలయంలో రెండో రోజు కలెక్టర్ల సదస్సులో ఆయన కీలక ఆదేశాలిచ్చారు. ఉపాధి హామీ పథకాన్ని డిమాండ్‌కు అనుగుణంగా నిర్వహించాలని.. 100 రోజుల పనిదినాలు సరిగా నిర్వహిస్తేనే మెటీరియల్ కాంపోనెంట్ వస్తుందని చెప్పారు. కానీ పని దినాలు, మెటీరియల్ కాంపోనెంట్‌ను పూర్తి చేయలేకపోతున్నారని అన్నారు. పల్లె పండుగలో 14.8 శాతమే పనులు చేశారని.. ఇంకా నెలన్నర సమయమే ఉందని గుర్తు చేశారు. అల్లూరి జిల్లాలో 54 శాతమైతే.. మరో జిల్లాలో 1.6 శాతమే పనులు కావడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు పూర్తయ్యాక బిల్లులు ఎందుకు చెల్లించట్లేదని.. కలెక్టర్లు నిర్లిప్తంగా ఎందుకు ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వద్ద ఉపాధి హామీ డబ్బులున్నా బిల్లులు ఎందుకు చెల్లించట్లేదని ప్రశ్నించారు.
'అవి అర్హులకే దక్కాలి'
'గత ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్‌ను దెబ్బతీసింది. గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం తిరిగి ప్రారంభించాం. కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులుంటే వారికీ పింఛన్ ఇవ్వాలి. సదరం ధ్రువీకరణ పత్రాలు అర్హులకే దక్కేలా చూడాలి. రాజధాని అమరావతి వేగంగా అభివృద్ధి చెందే నగరం. విజయవాడ, గుంటూరు వంటివి అమరావతిలో కలిసిపోతాయి. పట్టణీకరణ పెరుగుతున్న దృష్ట్యా నిరంతరాయంగా ప్రణాళికలుండాలి. ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలి. స్వచ్ఛాంధ్రలో భాగంగా పచ్చదనాన్ని పెంచేలా చూడాలి. స్వచ్ఛత - శుభ్రత అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. గత ప్రభుత్వం 82 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త వదిలి వెళ్లింది. చెత్త తొలగించే పనులు వేగంగా పూర్తి చేయాలి.' అని సీఎం పేర్కొన్నారు.
'అదే నినాదం'
'రాష్ట్రమే ఫస్ట్.. ప్రజలే ఫైనల్' అనే నినాదంతో ముందుకెళ్తున్నామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రభుత్వ పాలన 6 నెలలు గడిచిందన్నారు. నిర్బంధం, సంక్షోభం, అభద్రతలో గడిచిన ఐదేళ్ల కాలాన్ని ప్రజలు ఓ పీడకలగా భావించి తమ అభివృద్ధి, పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని చెప్పారు. 'బాధ్యతలు చేపట్టిన తొలి క్షణం నుంచి ప్రజల ఆశలు, ఆకాంక్షలు తీర్చేందుకు నాతో పాటు మంత్రివర్గ సహచరులంతా కృషి చేస్తున్నారు. ఈ 6 నెలల్లో గాడి తప్పిన వ్యవస్థల్ని సరిదిద్దాం. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో వేగవంతమైన నిర్ణయాలతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాం. మీ ఆశీస్సులు, భాగస్వామ్యంతో 'స్వర్ణాంధ్ర - 2047' విజన్‌తో ఏపీని నెంబర్ 1గా నిలబెడతాం' అని పేర్కొన్నారు.
Also Read: Saraswati Power Land: జగన్‌కు షాక్ ఇచ్చిన ప్రభుత్వం- సరస్వతిలోని భూములు వెనక్కి