Navy Day Celebrations In Visakha: నేవీ డే సందర్భంగా విశాఖలోని (Visakha) ఆర్కే బీచ్‌లో భారత నౌకాదళం వాయు విభాగం విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు (CM Chandrababu) హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మనవడు దేవాన్ష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేవీ అద్భుత విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విన్యాసాల్లో భాగంగా భారత నౌకాదళ పాటవం, పరాక్రమం ప్రదర్శించారు. దాదాపు 8 వేల అడుగుల ఎత్తు నుంచి పారాచ్యూట్ సాయంతో జాతీయ జెండా, నేవీ జెండాను ఎగురవేసి ఆహుతులను మంత్రుముగ్ధులను చేశారు.
నేవీదళ విన్యాసాల్లో భాగంగా సాగర తీరంలో అత్యాధునిక యుద్ధనౌకలు, విమానాలు, హెలికాఫ్టర్లు, ట్యాంకర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉగ్రవాదుల నుంచి బందీలను రక్షించే క్రమంలో యుద్ధ విన్యాసాలు, సముద్రంలో చిక్కుకున్న వారిని హెలికాఫ్టర్ల సాయంతో రక్షించే విధానం ప్రదర్శించిన తీరు సందర్శకులను కట్టిపడేసింది. సముద్రంలో బంకర్ పేలుళ్లు అబ్బురపరిచాయి. నేవీ విద్యార్థినుల హార్న్ పైప్ డాన్స్ అబ్బురపరిచింది. వేడుకలను తిలకించేందుకు వచ్చిన జనంతో విశాఖ తీరం జనసంద్రంగా మారింది.
'ఓషన్ ఎకానమీ.. పెద్ద ఆర్థిక అవకాశం'
ఓషన్ ఎకానమీ ఓ పెద్ద ఆర్థిక అవకాశమని సీఎం చంద్రబాబు అన్నారు. నేవీ డే విన్యాసాల అనంతరం ఆయన మాట్లాడారు. విశాఖలో తూర్పు నావికాదళం ఉండడం అదృష్టమని.. విశాఖ ఏపీకి ఆర్థిక రాజధాని అని అన్నారు. నాలెడ్జ్ హబ్, టూరిజం హబ్ సాగర నగరం వర్థిల్లనుందని చెప్పారు. ప్రధాని మోదీ త్వరలోనే రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేస్తారని.. త్వరలోనే మెట్రో రైలు కూడా రాబోతున్నట్లు చెప్పారు. అద్భుత విన్యాసాలు చేసిన నేవీ సిబ్బందికి అభినందనలు తెలిపారు. హుద్ హుద్ తుపాను సమయంలో నేవీ సాయం మరువలేనిదని గుర్తు చేశారు. 'దేశ రక్షణ, విపత్తుల నిర్వహణలో తూర్పు నావికాదళం సేవలు అద్భుతం. మెట్రో, భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణం చేస్తాం. ఐఎన్ఎస్ విరాట్‌ను తీసుకుని వచ్చేందుకు ఉన్న అవకాశాలు పరిశీలిస్తాం. వికసిత్ భారత్ నినాదంతో డిఫెన్స్ రంగంలో దూసుకుపోతున్నాం. ఓషన్ ఎకానమీకి విస్తృత అవకాశాలున్నాయి. ఆ దిశగా గట్టి ప్రయత్నం జరగాలి. ఇందుకు నేవీ సహకారం అందించాలి.' అని సీఎం పేర్కొన్నారు.
Also Read: Goli Shyamala: సముద్రంలో విశాఖ నుంచి కాకినాడ - 52 ఏళ్ల మహిళ సాహస యాత్ర, 150 కి.మీ ఈది అరుదైన ఘనత