Goli Shyamala Swim Visakha To Kakinada: 3 పదుల వయస్సులోనే చాలామంది నిరాశ నిస్పృహలతో కుంగిపోతుంటారు. చిన్న చిన్న అపజయాలకే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతూ వెనుకడుగు వేస్తుంటారు. అలాంటి వారికి 52 ఏళ్ల గోలి శ్యామల (Goli Shyamala) స్ఫూర్తిదాయకం. కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన ఈమె అరుదైన ఘనత సాధించారు. శ్యామల 5 పదుల వయసులోనూ విశాఖ నుంచి కాకినాడ వరకూ బంగాళాఖాతంలో 150 కి.మీ ఈది ఔరా అనిపించారు. విశాఖలోని (Visakha) ఆర్కే బీచ్‌లో డిసెంబర్ 28న మొదలైన ఈమె ప్రయాణం జనవరి 1న కాకినాడలోని ఎన్టీఆర్ బీచ్‌లో ముగిసింది. శ్యామల రోజుకు సగటున 30 కి.మీ ఈది 150 కి.మీ ప్రయాణాన్ని 5 రోజుల్లో పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆమెను కాకినాడ (Kakinada) సీపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో మురళీధర్, ఎమ్మెల్యే చినరాజప్ప, కాకినాడ కమిషనర్ భావన అభినందించారు.


నిరాశ నుంచి..


గోలి శ్యామల దశాబ్దానికి పైగా నిర్మాతగా, క్రియేటివ్ డైరెక్టర్‌గా, రచయితగా ప ని చేశారు. అయితే, తన యానిమేషన్ స్టూడియోను మూసివేసిన నిరాశలో కూరుకుపోయారు. దాన్నుంచి బయటపడేందుకు ఈతను ఓ మార్గంగా ఎంచుకున్నారు. దానిపై సాధన చేసి పట్టు సాధించిన అనంతరం.. ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ గురించి అవగాహన కల్పించడం మొదలుపెట్టారు. సముద్రంలో 150 కి.మీ ఈతను ప్రారంభించిన సమయంలో ఆమె భద్రత, విజయాన్ని నిర్ధారించడానికి.. 12 మంది సభ్యుల బృందం శ్యామలతో పాటు వెళ్లింది. వీరిలో పరిశీలకులు, ఒక వైద్యుడు, ఫిజియోథెరపిస్ట్, ఫీడర్లు, స్కూబా డైవర్లు, కయాకర్లు ఉన్నారు. వీరు 2 పెద్ద పడవలు, ఒక చిన్న పడవలో ఆమె వెంట వెళ్లారు.


2021లో రామసేతు, గత ఫిబ్రవరిలో లక్షద్వీప్‌లో ఈది ఆసియాకు చెందిన మొదటి వ్యక్తిగా తాను నిలిచినట్లు శ్యామల తెలిపారు. సముద్రంలో బృంద సభ్యులు వెంట వచ్చారన్నారు. తాబేళ్లు తన వెంట రావడం సంతోషం కలిగించిందని.. అక్కడక్కడ జెల్లీ చేపలు కొంచెం ఇబ్బంది పెట్టాయన్నారు.


గత విజయాలు


పాల్క్ స్ట్రెయిట్: 13 గంటల 43 నిమిషాల్లో 30 కిలోమీటర్లు ఈది ఈ ఘనత సాధించిన రెండో మహిళగా నిలిచారు.


కాటాలినా ఛానల్: 12 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో 19 గంటల్లో కాటాలినా ద్వీపం నుంచి లాస్ ఏంజిల్స్ వరకూ 36 కి.మీ ప్రయాణించారు.


లక్షద్వీప్ దీవులు: లక్షద్వీప్ పర్యాటకాన్ని ప్రోత్సహించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నుంచి ప్రేరణ పొంది.. కిల్టన్ ద్వీపం నుంచి కద్మత్ ద్వీపం వరకూ 18 గంటల్లో 48 కిలోమీటర్లు ఈదారు.


శ్యామల నదుల్లోనూ ఈది సత్తా చాటారు. కృష్ణా నదిలో 1.5 కి.మీ, హుగ్లీ నదిలో 14 కిలోమీటర్లు, గంగా నదిలో 13 కి.మీ, భాగీరథి నది 81 కి.మీలు ఈదారు.


మంత్రి లోకేశ్ అభినందన






ఈ ఘనత సాధించిన గోలి శ్యామలను మంత్రి లోకేశ్ (Nara Lokesh) అభినందిస్తూ ట్వీట్ చేశారు. 'కాకినాడ జిల్లాకు చెందిన గోలి శ్యామల గారు విశాఖ ఆర్కే బీచ్ నుంచి కాకినాడలోని సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్ వరకు సముద్రంలో 150 కిలోమీటర్లు ఈత కొట్టి అద్భుతమైన ఘనత సాధించినందుకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. పట్టుదల, దృఢ సంకల్పంతో సవాళ్లను అధిగమిస్తూ, ఆమె ఈ సాహస యాత్రను 5 రోజుల్లో పూర్తి చేసి, మనందరికీ స్ఫూర్తినిచ్చారు. సముద్ర సంరక్షణపై అవగాహన పెంచేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఆమె నిబద్ధతకు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ మిమ్మల్ని చూసి గర్విస్తోంది శ్యామల గారూ!' అని పేర్కొన్నారు.


Also Read: Letter To CM Chandrababu: వైసీపీ హయాంలో అక్రమ భూ రిజిస్ట్రేషన్లు, దారుణాలు జరిగాయంటూ చంద్రబాబుకు మాజీ ఉద్యోగి లేఖ