CJI NV Ramana Comments :న్యాయవ్యవస్థను కించ పరుస్తూ అదే పనిగా అభాండాలు వేస్తూ పైశాచిక ఆనందం పొందే వారి సంఖ్య ఇటీవలి కాలంలో అనూహ్యంగా పెరిగిపోయిందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో జిల్లా కోర్టుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన తన ప్రసంగంలో కోర్టులపై నిందలు వేస్తున్న వారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇటీవల ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులపై అభాండాలు వేయడం తేలికైందన్నారు. కొందరు తీర్పులకు కూడా వక్రభాష్యాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేసి పైశాచిక ఆనందం పొందే వారి సంఖ్య పెరుగుతోందన్నారు. 


కోర్టు తీర్పులకు వక్రభాష్యం చెప్పడం పారిపాటైంది: సీజేఐ 


పరిధి దాటనంత వరకూ న్యాయవ్యవస్థకూ అందరూ మిత్రులేనని సీజేఐ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. పరిధులు దాటిన వారిని ఉపేక్షించడం  రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈ విషయాన్ని వాళ్లు గుర్తుపెట్టుకోవాని ఓ రకంగా హెచ్చరికలుగా సీజేఐ వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థ కొందరు స్వార్థపరుల కోసం కాదని, న్యాయవ్యవస్థ ప్రజల హక్కు అని సీజేఐ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై అభాండాలు వేయడం సరికాదన్నారు. కోర్టు తీర్పులకు వక్రభాష్యం చెప్పడం పరిపాటైందని విమర్శించారు. పరిధి దాటినవారిని ఉపేక్షించడం రాజ్యాంగ విరుద్దమన్నారు. ప్రజాస్వామ్యం నిలబడాలంటే న్యాయవ్యవస్థ ముఖ్యమని ఎన్వీరమణ వ్యాఖ్యానించారు.


జిల్లా కోర్టుల ఏర్పాటు కొత్త అధ్యాయం : ఎన్వీ రమణ
 


తెలంగాణలో కొత్తగా 32 జిల్లా కోర్టులను సీజేఐ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్‌  ప్రారంభించారు.   ‘‘న్యాయవ్యవస్థ అభివృద్ధిలో ఎంతోకొంత విజయం సాధించాం. న్యాయవ్యవస్థ ప్రజలకు చేరువలో ఉండాలి. అందుకే కొత్త కోర్టుల ఏర్పాటు, జడ్జీల నియామకం చేశాం. తెలంగాణకు సంబంధించి 4 కీలక నిర్ణయాలు తీసుకున్నాం. దేశ న్యాయవ్యవస్థలో తెలంగాణ (Telangana) కొత్త అధ్యాయానికి తెర తీసింది. జిల్లాల న్యాయవ్యవస్థ ఇంతలా వికేంద్రీకరణ కావడం ఇదే తొలిసారి. చాలాకాలం తర్వాత న్యాయ వ్యవస్థ వికేంద్రీకరణ జరిగింది. న్యాయవ్యవస్థ వికేంద్రీకరణ దిశగా తొలి అడుగుపడింది. ఒకేసారి 23 జిల్లా కోర్టుల ఏర్పాటు చరిత్రలో నిలుస్తుంది. జిల్లాల విభజనతో కేసుల బదిలీ సులభం అవుతోందని’’ ఎన్వీరమణ తెలిపారు.


న్యాయవ్యవస్థకు మౌలిక వసతులు కల్పిస్తాం : కేసీఆర్


జిల్లా కోర్టులు ఏర్పాటు కావాలని చీఫ్ జస్టిస్‎ను అడగగానే ఒప్పుకున్నారని కేసీఆర్ తెలిపారు.  జిల్లా కోర్టులో అన్ని పోస్టులను భర్తీ చేస్తాం. సిటీ సివిల్ కోర్టు, రంగారెడ్డి కోర్టులు విభజించాలి. జుడీషియల్ డిపార్ట్‎మెంట్‎లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కేసీఆర్ ప్రకటించారు.