Chandrababu On YSRCP Plenary : వైసీపీ నవ రత్నాల పేరిట నవ ఘోరాలకు పాల్పడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఏం సాధించారని ప్లీనరీ నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌ పై చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు నగరిలో రోడ్‌ షో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాజకీయాల కోసం జగన్‌ అందర్నీ వాడుకున్నారని విమర్శించారు. అమ్మను పార్టీ నుంచి సాగనంపారని ఆరోపించారు. పాదయాత్రలో తిరిగినట్లు సీఎం జగన్ ఇప్పుడు తిరగాలని చంద్రబాబు సవాల్ చేశారు. ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో అప్పుడు జగన్‌కు తెలుస్తుందన్నారు. మద్యంలో విషపదార్థాలు ఉన్నట్లు ల్యాబ్ నివేదికలు చెబుతున్నాయన్నారు. జే బ్రాండ్‌పై వైసీపీ ప్లీనరీలో సమాధానం చెప్పాలని చంద్రబాబు సవాల్ చేశారు. వైసీపీ పాలన పోవాలంటే ప్రజలు అండగా నిలబడాలని చంద్రబాబు అన్నారు.


చంద్రబాబు సవాల్ 


వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం నవరత్నాలు కాదు నవ ఘోరాలకు పాల్పడుతోందని విమర్శించారు. ఏం సాధించారని వైసీపీ ప్లీనరీ నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. తన  ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఏపీలోనే అధికంగా ఉన్నాయన్నారు. ఇతర రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తే ఏపీలో ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాలకు వెళ్లి పెట్రోల్‌ నింపుకునే పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు. మద్యం ధరలు రాష్ట్రంలో విపరీతంగా పెంచారని మండిపడ్డారు. మద్యం ధరలు పెంచి ఖజానాలు నింపుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నాసిరకం మద్యం అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు.  


చెత్త పన్ను ఘనత వైసీపీదే


టీడీపీ అధికారంలోకి వచ్చాక నగరిలో జౌళి పార్క్ ఏర్పాటుచేస్తామని చంద్రబాబు అన్నారు. అమరావతి, పోలవరాన్ని నాశనం చేశారన్నారు. కాలువ తవ్వలేని వ్యక్తి సాగునీటి ప్రాజెక్టులు కడతారా అని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనులు 72 శాతం టీడీపీ హయాంలో పూర్తిచేశామన్నారు. టీడీపీ అధికారంలో ఉంటే పోలవరం పూర్తి అయ్యేదన్నారు. సాగునీటి ప్రాజెక్టులు నిలిచిపోవడానికి వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీలు, ఆర్టీసీ బస్సు ఛార్జీలు ఇష్టారీతిన పెంచారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త పన్ను వేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.