Chittoor News : పశువుల మేత భూమిని కబ్జా చేశానని తనపై ఆరోపణలు చేసిన నారా లోకేశ్ కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధమా అంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సవాల్ విసిరారు. గురువారం చిత్తూరు వైసీపీ కార్యాలయంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యువగళం పాదయాత్రలో లోకేశ్ తనపై చేసిన ఆరోపణలన్ని పచ్చి అబద్ధాలని విమర్శించారు. తాను 250 ఎకరాలు, రూ.500 కోట్లు సంపాదించినట్లు కాణిపాకంలో వచ్చి ప్రమాణం చేసి యువగళం యాత్రను కొనసాగించాలని డిమాండ్ చేశారు. లోకేశ్ ఎవరో రాసిన స్క్రిప్ట్ చదవడం కాకుండా సొంతంగా రాజకీయంలో ఎదగాలని హితవు పలికారు. తాను కష్టపడి వ్యాపార, రాజకీయ రంగాల్లో ఎదిగానని చెప్పారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయం వల్ల మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యే అవకాశం కోల్పోయానన్నారు. ప్రజారాజ్యం, తెలుగుదేశం, వైసీపీ మూడు పార్టీలకు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన రాజకీయ చరిత్ర తనదని చెప్పారు.
చంద్రబాబుది రక్తచరిత్ర
పశువుల మేత భూమిని పట్టా చేసుకోవడం సాధ్యమా అని ఎమ్మెల్యే శ్రీనివాసులు ప్రశ్నించారు. కనీస పరిజ్ఞానం కూడా లేకుండా ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్టును చదవడమేనా లోకేశ్ కు తెలిసిందని ప్రశ్నించారు. స్క్రిప్ట్ రాసి ఇచ్చిన వాళ్లు కనీసం సర్పంచ్ గా అయిన గెలిచారా అని ప్రశ్నించారు. లోకేశ్ రాలేకపోతే స్క్రిప్ట్ రాసి ఇచ్చిన స్థానిక నాయకులైన సరే కాణిపాకం వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. చిత్తూరులో మూడు రోజుల పర్యటనలో కనీసం 10 కిలోమీటర్ల దూరం కూడా నడవలేకపోయారని లోకేశ్ ను ఎద్దేవా చేశారు. ఎక్కడికి వెళితే అక్కడ ఎమ్మెల్యే పైన ఆరోపణలు చేయడం తప్ప సొంతంగా ఒక్క మాటైనా సొంతంగా మాట్లాడగలవా అని అన్నారు. నారావారిపల్లెలో 2012లో రాజకీయ ఓనమాలు నేర్పించిన వారిలో నేను కూడా ఒకడిననే విషయాన్ని మర్చిపోవద్దని గుర్తు చేశారు. చంద్రబాబుది వెన్నుపోటు, రక్త చరిత్ర అని విమర్శించారు. చిత్తూరులో ఎమ్మెల్యే టికెట్ వందల కోట్లకు అమ్ముకోవడం తప్ప మీరు కార్యకర్తలకు ఏం చేశారని ప్రశ్నించారు. 2004, 2014లో టికెట్ ఇస్తానని మోసం చేయలేదా అని ప్రశ్నించారు.
కుప్పంలో గెలుపు మాదే
1994 నుంచి చిత్తూరులో తమ కుటుంబం వల్లే తెలుగుదేశం మనుగడ సాగించిందన్న విషయం మర్చిపోకూడదన్నారు ఎమ్మెల్యే శ్రీనివాసులు. కేవలం రోడ్డు కాంట్రాక్టులు తప్ప తనకి వేరే ఎలాంటి వ్యాపారాలు లేవని స్పష్టం చేశారు. చిత్తూరు, తచ్చురు కాంట్రాక్టర్ ఎవరో కూడా తెలియదని, ఒకసాటి కాంట్రాక్టర్ గా నేను అతని వద్ద ఎలా డబ్బులు తీసుకుంటానని ప్రశ్నించారు. ప్రభుత్వ భవనాలు వేటిని కొట్టాం, మళ్ళీ కట్టాం అని చెప్పిన దానిని నిరూపించాలన్నారు. సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యేల పైన ఆరోపణలు చేయడం తప్ప, రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప ఏం చేతకాదన్నారు. చిత్తూరులో పార్టీ ఇన్ ఛార్జ్ ను నియమించే పరిస్థితి కూడా లేదన్నారు. ఈసారి జిల్లాలో కుప్పంతో సహా 14 నియోజకవర్గాలు గెలుస్తామన్నారు. 175 నియోజకవర్గాలు పక్కనపెట్టి కనీసం కుప్పంలో గెలిచే దాని గురించి ఆలోచించుకో అని చెప్పారు. చిత్తూరులో షుగర్ ఫ్యాక్టరీ, విజయ డెయిరీని చంద్రబాబు టైంలోనే మూసివేశారన్నారు. మూడు నెలల్లోనే విజయ డైరీని మళ్లీ తెరిపిస్తామన్నారు.