IAS Responce :  ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిపై పలు మీడియాల్లో వచ్చిన కథనాలను ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఖండించింది. హలో తాడేపల్లి, జవహర్ రెడ్డి ఇంత ఖాళీగా ఉన్నారా ? , సీఎస్‌తో కలిసి కారులో తిరుపతి వైపు .. అనే శీర్షికలతో రెండు పత్రికల్లో వచ్చిన వార్తలతో పాటు ఇతర మీడియాల్లో వచ్చిన సమాచారం కరెక్ట్ కాదని ఐఏఎస్ ఆఫీసర్లసంఘంతెలిపింది. వివేకా హత్య కేసులో విచారణకు  హాజరైన కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ లను  జవహర్ రెడ్డి ఆయన వాహనంలో విజయవాడకు తీసుకు వచ్చారని ఆ కథనాల్లో చెప్పారని.. ఈ సమాచారం అంతా తప్పు అని అసోసియేషన్ చెబుతోంది.


ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆరో తేదీన విజవాడలో సమావేశం అయిందని.. ఈ వార్తలపై చర్చించిందని ప్రెస్ నోట్ విడుదల చేశారు.  జిల్లా అధికారులతో ధృవీకరించిన తర్వాత, ప్రధాన కార్యదర్శి వైఎస్ఆర్ కడప జిల్లాలో  ముందస్తు షెడ్యూల్ కార్యక్రమాలకు హాజరైనట్లు నిర్ధారించామన్నారు.  ముద్దనూరు గ్రామంలోని ZPP ఉన్నత పాఠశాల కార్యక్రమం చాలా కాలం క్రితం అక్టోబర్, 2022లో నిర్ణయించారని తెలిపారు.  జిల్లా కలెక్టర్ తో కలిసి సీఎస్ పర్యటించారని.. ఈ వార్తల్లో చెప్పినట్లుగా కృష్ణమోహన్ రెడ్డిని కానీ..నవీన్ ను కానీ సీఎస్ కలవలేదని ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. 


సీఎస్‌ విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరిన రేణిగుంట విమానాశ్రయానికి చీఫ్‌ సెక్రటరీని స్వయంగా తీసుకెళ్లినట్లు కడప జిల్లా  కలెక్టర్‌ చెప్పారన్నారు.  అందుకే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,  కృష్ణమోహన్‌రెడ్డి ఒకే కారులో విజయవాడకు తిరిగి వచ్చారన్న వార్తలో ఉన్న అంశాలు పూర్తిగా అవాస్తవమని, సీఎస్‌పై దుష్ప్రచారం చేయాలనే దురుద్దేశంతో రాశారని ఆరోపించారు. సీఎస్ పరువుకు భంగం కలిగించేలా ఉన్న ఈ వార్తలను IAS అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ తీవ్రంగా ఖండిస్తుందని ప్రకటించారు.   సరైన వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని మీడియాకు కోరారు. 


సీఎస్ జవహర్ రెడ్డి సీనియర్ ఐఏఎస్ అధికారి అని.. ఆయన ఎన్నో ఉన్నత  పదవుల్లో బాధ్యతలు నిర్వహించారని ఐఏఎస్ అఫీసర్స్ అసోసియేషన్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన కార్యదర్శికి సాంప్రదాయకంగా గొప్ప గౌరవం ఇస్తారని..  పై వార్తలు,  మీడియా ప్రచారం వల్ల ఆ గౌరవానికి భంగం ఏర్పడిందన్నారు.  IAS అధికారుల ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని.. ఇది అసంబద్ధం  అన్యాయం అని ఐఏఎస్ అధికారుల సంఘం పేరుతో ఓ ప్రకటన విడుదలయింది. 


అయితే ఈ ప్రెస్ నోట్ వైట్ పేపర్ మీద ఉంది కానీ.. ఐఏఎస్ అధికారుల సంఘం పేరుతో ఉన్న లెటర్ ప్యాడ్ పైన లేదు. ఈ సంఘం అధ్యక్ష, కార్యదర్శుల సంతకాలు కానీ.. ఇతర సభ్యుల సంతకాలు కానీ ప్రెస్ నోట్ లో లేవు. సాధారణంగా ఇలాంటి ఖండన ప్రకటనలు ఐఏఎస్ లు ప్రెస్ మీట్ పెట్టి చెబుతారు. గతంలో పులుమార్లు చెప్పారు. అదే సమయంలో కనీసం అపీషియల్ అసోసియేషన్ ప్రెస్ నోట్ తో అయినా ఖండిస్తారు. అలాంటి నోట్ కూడా జారీ చేయలేదు. ఇది కూడా అధికారవర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.