Minister Roja On Lokesh : తండ్రి ముఖ్యమంత్రిగా, తాను మంత్రిగా ఉన్నా కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని రికార్డు నారా లోకేశ్ సొంతమని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె.రోజా విమర్శించారు. బుధవారం చిత్తూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. అనంతరం మీడియాతో మాట్లాడారు. నారా లోకేశ్ చేస్తున్న పాదయాత్ర యువగళం కాదని ఒంటరి గళమని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. లోకేశ్ డైమండ్ రాణి వ్యాఖ్యలపై రోజా సీరియస్ అయ్యారు. నారా లోకేశ్ ను అంకుల్ అంటూ విరుచుకుపడ్డారు. యువగళం ప్రారంభించిన పప్పునాయుడు, తన తండ్రి ఈ రాష్ట్రానికి ఏం చేశారని, ఏం చేయబోతున్నారో చెప్పకుండానే నడుస్తున్నారని విమర్శించారు. తండ్రి ముఖ్యమంత్రి హోదాలో ఉండగా హైదరాబాద్ ను లోకేశ్ దోచుకోవడమే కాకుండా తన తండ్రిని మళ్లీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలని తహతహలాడుతున్నారని మంత్రి ఆరోపించారు. 


లీడర్ గా వందశాతం ఫెయిల్ 


ఒకవైపు తన తండ్రి చంద్రబాబు కాంగ్రెస్ తో కుమ్మక్కై జగన్ వేధించినా, జగన్ ఆత్మసైర్థ్యంతో పాదయాత్రను ప్రారంభించి పేదల కష్టాలను వింటూ అధికారంలో వచ్చారని మంత్రి రోజా అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల కష్టాలను తీరుస్తున్నారన్నారు. ఆ ధైర్యంతోనే మళ్లీ ఓట్లు అడుగుతున్నామన్నారు. తండ్రీ కొడుకులకు అవసరమైనప్పుడల్లా నందమూరి కుటుంబాన్ని వాడుకొని, అధికారంలోకి వచ్చాక వాళ్లను విస్మరిస్తున్నారని విమర్శించారు. అది నందమూరి కుటుంబం గుర్తించలేక పోతున్నారన్నారు. భద్రతా సిబ్బంది, టీడీపీ వాలంటీర్లు లేకపోతే పది మంది కూడా లోకేశ్ పాదయాత్రలో లేరన్నారు. లోకేశ్ చేస్తున్న పాదయాత్ర యువగళం కాదని, ఒంటరి గళమన్నారు.  లీడర్ గా వంద శాతం ఫెయిల్యూర్ అయ్యారని, ఇది మంగళగిరి ప్రజలు గుర్తించే లోకేశ్ ను ఓడించారన్నారు. తండ్రి ముఖ్యమంత్రిగా , తాను మంత్రిగా ఉన్నా కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని రికార్డు లోకేశ్ సొంతమని రోజా ఎద్దేవా చేశారు. 


లోకేశ్ పాదయాత్రలో 10 మంది కూడా లేరు


"మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పకుండా కేవలం జగన్ ను తిట్టేందుకే లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారు. నన్ను డైమండ్ పాప అంటున్నారు ఏంటీ లోకేశ్ అంకుల్ చెప్పండి. గతంలో దోచుకుని హైదరాబాద్ లో దాచుకున్నారు. మళ్లీ దోచుకోడానికి అవకాశం ఇవ్వాలా అని అడుగుతున్నాను. జగన్ ఏ ముఖ్యమంత్రి కొడుకూ చేయని విధంగా 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. పొత్తులు లేకుండా అధికారంలోకి వచ్చారు. అక్రమ కేసుల పెట్టి జైలులో పెట్టినా ఇవాళ అధికారంలోకి వచ్చారు. 151 సీట్లు సాధించి చరిత్ర తిరగరాశారు జగన్. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేశారు. అందుకే మళ్లీ ధైర్యంగా ఓట్లు వేయాలని అడుగుతున్నారు. నందమూరి కుటుంబాన్ని నారా కుటుంబం వాడుకుంటుంది. అధికారంలో ఉన్నప్పుడు నందమూరి కుటుంబం అవసరం లేదు, అధికారంలోకి రావడానికి నందమూరి కుటుంబాన్ని వాడుకుంటున్నారు చంద్రబాబు. లోకేశ్ ది యువగళం కాదు ఒంటరిగళం, గన్ మెన్లు, రోప్ పార్టీ తీసేస్తే 10 మంది కూడా లేదు. మంగళగిరి ప్రజలు ముందుగానే గమనించి లోకేశ్ ను ఓడించారు. లోకేశ్ ఐరన్ లెగ్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఏదొకటి జరుగుతుంది. ప్రజలు లోకేశ్ పాదయాత్ర వస్తుందంటే భయపడిపోతున్నారు."- మంత్రి రోజా