ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న సినిమా టికెట్ల సమస్యల నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. మెగాస్టార్ చిరంజీవి నేడు (జనవరి 13) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు. ఈ మేరకు మధ్యాహ్న భోజనం సమయంలో చిరంజీవికి ముఖ్యమంత్రి జగన్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఇద్దరూ కలిసి మధ్యాహ్న భోజనం చేసే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం సినిమా పరిశ్రమపై ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న వేళ.. వీరి భేటీ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. 


ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రస్తుతం చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి చిరంజీవి ముఖ్యమంత్రి జగన్‌కు వివరించే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. ముఖ్యంగా సినిమా టికెట్ల వివాదంపై ప్రధానంగా వీరి మధ్య చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. రోజురోజుకీ ఈ వివాదం ముదురుతున్న నేపథ్యంలో దీనికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని చిరు భావిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ, ఇటీవలే చిరంజీవి చేసిన ప్రకటన ఇందుకు విరుద్ధంగా ఉంది. చిత్ర పరిశ్రమకు తాను పెద్ద దిక్కుగా ఉండబోనని.. ఏదైనా సాయం చేయాల్సి వచ్చినప్పుడు సినీ కార్మికులకు అండగా చొరవ తీసుకొని మరీ నిలబడతానని వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను చిరంజీవి ముఖ్యమంత్రి జగన్‌తో చర్చిస్తారా? అన్న అనుమానం వ్యక్తమవుతోంది.


సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ వ్యక్తిగతమా? అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. ఎందుకంటే మొత్తం సినిమా పరిశ్రమ గురించిన సమస్యే అయితే ప్రతిసారి నాగార్జున, సురేష్ బాబు, దిల్ రాజు వంటి ఇతర సినీ పెద్దలు అంతా కలిసి సీఎంను కలిసేవారు. కానీ, తాజాగా ఉన్నట్టుండి చిరంజీవి ఒక్కరే సీఎం అపాయింట్‌మెంట్ కోరి.. ఆయన్ను కలిసేందుకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాక, ఇటీవల ఓ కార్యక్రమంలో తాను సినీ పెద్దగా ఉండబోనని బహిరంగంగా చిరు తేల్చి చెప్పాక కూడా.. ఆ విషయంలో ఇంత చొరవ తీసుకుంటారా? అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.


మరోవైపు, మోహన్ బాబు రాసిన బహిరంగ లేఖ కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాలి. సినీ పరిశ్రమ సమస్యలను అంతా చర్చించుకొని.. కలిసికట్టుగా ప్రభుత్వానికి విన్నవించుకోవాలని కొద్ది రోజుల క్రితం ఆయన లేఖ ద్వారా తెలిపారు. పరిశ్రమ నిర్ణయాల గురించి తమకు సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వాన్ని కలవడం సరికాదని లేఖలో అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.


Also Read: Bigg Boss OTT: బిగ్ బాస్ ఓటీటీలో టాప్ సింగర్.. ఒప్పుకుంటాడా..?


Also Read: Pooja Hegde: త్రివిక్ర‌మ్ గారూ... ఆ సీన్ యూట్యూబ్‌లో రిలీజ్ చేయండి!


Also Read: థియేటర్ల కోసం సినిమాలు దాచాల్సిన అవసరం నాకు లేదు! వాళ్లు హ్యాపీగా ఉండాలనే... - నాని ఇంటర్వ్యూ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి