Chegondi Surya Prakash decided to join YSRCP : జనసేనను ఇబ్బంది పెట్టేలా రోజూ లేఖలు రాస్తున్న కాపు సంక్షేమ సేన నేత చేగొండి హరిరామజోగయ్య కుమారుడు సూర్య ప్రకాష్ వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆయన సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుంటారని సమాచారం. 2018లో జనసేనలో చేరారు చేగొండి సూర్యప్రకాష్. 2022 జనవరిలో సూర్యప్రకాష్‌ను పీఏసీలో మెంబర్‌గా నియమించారు పవన్‌కల్యాణ్. అయితే ఇటీవలి రాజకీయ పరిణామాలు, టీడీపీతో సీట్ల పంపకాలు, తన సీటుపై పవన్ కల్యాణ్ క్లారిటీ ఇవ్వకపోవడంతోనే అసంతృప్తితో ఉన్న సూర్యప్రకాష్ పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
పాలకొల్లు నుంచి చేగొండి సూర్య ప్రకాష్‌కు వైసీపీ టిక్కెట్ ?
మరోవైపు సూర్యప్రకాష్ తండ్రి చేగొండి సైతం తెలుగుదేశంతో పొత్తు అంశం, సీట్ల పంపకాలు, పవర్ షేరింగ్ లాంటి పలు అంశాలపై పవన్‌కు వరుస లేఖలు సంధించారు. చేగొండి సూచనలను పవన్‌కల్యాణ్ పెద్దగా పట్టించుకోలేదు. పరోక్షంగా తనకు సలహాలు, సూచనలు ఇచ్చేవారు అక్కర్లేదంటూ చేగొండిపై విమర్శలు చేశారు. దీంతో సూర్యప్రకాష్ ఇక పార్టీలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నారు. చేగొండి సూర్య ప్రకాష్ జనసేన నేతగా ఆచంట నియోజకవర్గంలో పని చేస్తూ ఉండేవారు. పేరుకు లీడరే కానీ ఎప్పుడూ బయటకు వచ్చి కార్యక్రమాలు చేపట్టింది లేదు. అందుకే ఆ సీటును టీడీపీకి కేటాయించారు. దీంతో సూర్యప్రకాష్ మరింతగా అసౌకర్యానికి గురయ్యారు. వైసీపీలో చేరితో.. ఏదో ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం లభిస్తుందని అంచనా వేసుకుంటున్నారు.
గతంలో ప్రజారాజ్యంలో ఉండి చిరంజీవిపైనే జోగయ్య విమర్శలు
పాలకొల్లు అసెంబ్లీ నియోజవర్గం వైసీపీ ఇన్‌చార్జ్‌గా సూర్యప్రకాశ్‌ను నియమించే అవకాశం ఉందని తాజా సమాచారం. జోగయ్య కుమారుడు వైసీపీలే చేరనుండటంతో.. ఇంత కాలం పవన్ ను.. జనసేనను ఇబ్బంది పెట్టేలా.. జనసేన కాపుల పార్టీ అన్నట్లుగా చిత్రీకరించడం కోసం లేఖలు రాశారని జనసైనికులు అనుమానిస్తున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన సమయంలో చిరంజీవి వెంట ఉన్నారు. తర్వాత ఆయన పై విమర్శలు చేశారు. చిరంజీవి పాలకొల్లులో నామినేషన్ వేస్తే తానే గెలిపిస్తానని భరోసా ఇచ్చారు. అయితే ఆయన ఎలక్షన్ పని చేయకుండా ఇంట్లో ఉండిపోవడంతో చిరంజీవి ఓడిపోయారు. తర్వాత వైసీపీలో చేరి జగన్ ను పొగిడారు. మళ్లీ సైలెంట్ అయ్యారు.
పవన్ ను ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందిపెట్టారా ?
జనసేనలో చేరకపోయినా పవన్ కు సలహాలిస్తూ వస్తున్నారు. పవన్ కూడా ఆయనను గౌరవిస్తున్నారు. పవన్ సీఎం అవ్వాలనేది తన కోరికగా చెప్పుకొచ్చారు. పవన్ 40 సీట్లు తక్కువ కాకుండా పొత్తులో తీసుకోవాలంటూ లేఖలు రాసారు. పవన్ 24 సీట్లు తీసుకోవటం పైన ఘాటుగా స్పందించారు. జనసేన సత్తా ఇంతేనా అంటూ ప్రశ్నించారు. పవన్ నిర్ణయంతో జనసైనికుల్లో ఆందోళన వ్యక్తం అవుతుందని..పవన్ అధికారంలో వాటా గురించి చంద్రబాబు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసారు.