Bengaluru Rameshwaram Cafe Blast: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో భారీ పేలుడు అలజడి సృష్టించింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్యాస్ సిలిండర్ పేలినట్టు అనుమానిస్తున్నారు. భారీ శబ్దం రావడం వల్ల స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. HAL పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. నిత్యం రద్దీతో ఉండే రామేశ్వరం కేఫ్‌లో ఈ ప్రమాదం జరగడం సంచలనమైంది. గాయపడ్డ వాళ్లలో ముగ్గురు కేఫ్ సిబ్బందితో పాటు ఓ కస్టమర్ ఉన్నట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం 1గంట ప్రాంతంలో కేఫ్‌లో ఓ బ్యాగ్ పెట్టారని, అందులో పేలుడు పదార్థం ఉందని అనుమానిస్తున్నారు.
పేలుడు సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. ఈ పేలుడు శబ్దానికి స్థానికులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. కేఫ్ పరిసర ప్రాంతాల్లో గందరగోళం నెలకొంది. పెద్ద ఎత్తున స్థానికులు గుమి గూడారు.
పోలీసులతో పాటు ఫోరెన్సిక్ సిబ్బంది కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించింది. అక్కడి మెటీరియల్‌ని సేకరించింది. ఈ పేలుడికి కారణమేంటన్నది పరీక్షలు చేసిన తరవాతే వెల్లడి కానుంది. ఇది సిలిండర్ పేలుడు కాకపోవచ్చని,బాంబు పేలి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ కూడా ఘటనా స్థలానికి చేరుకుంది.