Ysrcp Leaders Tension on Mydukuru Constituency: ఏపీలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ (CM Jagan) ఇప్పటికే పలు నియోజకవర్గాలకు ఇంఛార్జీలను ఖరారు చేశారు. చాలా చోట్ల సిట్టింగులను మార్చి.. కొత్త వారికి అవకాశమిచ్చారు. ఈ క్రమంలో సీఎం సొంత జిల్లాలోనూ పలు చోట్ల మార్పులు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం కడపలోని మైదుకూరు (Mydukuru) నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. సామాజిక సమీకరణాలు, ఎమ్మెల్యేల పనితీరు, రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అభ్యర్థిని మార్పు చేయనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం మైదుకూరు ఎమ్మెల్యేగా శెట్టిపల్లి రఘురాం రెడ్డి (Settipalli Raghuram Reddy) కొనసాగుతున్నారు. అయితే, నియోజకవర్గంలో రఘురామిరెడ్డి పని తీరు సరిగా లేకపోవడంపై  కొంత వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే సహకారంతో బ్రహ్మంగారి మఠం మండలానికి చెందిన జడ్పీటీసీ గోవిందరెడ్డి, ఎంపీపీ వీరనారాయణరెడ్డిలు చెప్పిందే వేదంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నట్లు సమాచారం. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన మాచినురి చంద్ర వ్యవహారం కూడా పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా ఉందని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఆయన మున్సిపల్ ఛైర్మన్ గా కొనసాగుతున్నారు. 


ఆ రెండే కీలకం


మైదుకూరు నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గంతో పాటు బలిజ సామాజిక వర్గం కూడా గెలుపోటముల్లో కీలక పాత్ర పోషిస్తోంది. టీడీపీ నుంచి వచ్చిన మాచునూరి చంద్ర బలిజ సామాజిక వర్గానికి చెందిన నేత. అక్కడ బలిజ సామాజిక వర్గం అధికంగా ఉండడంతో ఆయనకు మున్సిపల్ ఛైర్మన్ గా వైసీపీ అవకాశం కల్పించింది. అయినప్పటికీ బలిజ సామాజిక వర్గ ఓటర్లు టీడీపీకే మొగ్గు చూపుతున్నట్లు తేలడంతో దాన్ని నివారించేందుకు అధిష్టానం మైదుకూరుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో సీఎం జగన్ ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఓ వైపు ఎమ్మెల్యే అభ్యర్థిని మారుస్తారన్న ప్రచారం సాగుతున్నా.. మరోవైపు శెట్టిపల్లి రఘురాం రెడ్డి కుమారుడు నాగిరెడ్డి, అదే జిల్లాకు చెందిన ఓ డాక్టర్ మైదుకూరు టికెట్ ఆశిస్తున్నారు. అయితే, ఎమ్మెల్యే కుమారుడి పట్ల అధిష్టానం సుముఖుత చూపనట్లు పలువురు జిల్లా నేతలు పేర్కొంటున్నారు. దీంతో, నియోజకవర్గంలో రెడ్డి సామాజికవర్గం ఎలాగో వైసీపీకి అండగా ఉంటుందని.. మరో బలమైన బలిజ సామాజిక వర్గాన్ని కూడా తమవైపునకు తిప్పుకోవాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ సామాజిక వర్గానికి చెందిన సింగసాని గురు మోహన్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడితే ఎలా ఉంటుందని సీఎం జగన్ సర్వేలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది.


అన్నీ సర్వేలు ఆయన వైపే


దాదాపు అన్ని సర్వేల్లోనూ సింగసాని గురు మోహన్ ముందున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ మారే నేతల కంటే సీఎం జగన్ కు సన్నిహితుడు, పార్టీకి విధేయుడుగా ఉన్న ఆయన్నే బరిలో దించితే బాగుంటుందని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, కడప పార్లమెంటు సెగ్మెంట్ లో కడప, మైదుకూరు, పులివెందుల, బద్వేలు నియోజకవర్గాల్లో బలిజ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉండటంతో పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు తమ పార్టీకే వస్తాయన్న ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ మైదుకూరు నియోజకవర్గంపై సీఎం జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో అటు జిల్లా నేతల్లో టికెట్ ఎవరికి దక్కుతుందో అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.


Also Read: Paritala Sunitha About Jagan: పిన్నమ్మను, షర్మిలను పట్టించుకోని జగన్, మహిళలకు ఏం న్యాయం చేస్తారు?: పరిటాల సునీత