Hanuman, Prashanth Varma: ఇండియన్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో టాలీవుడ్ నుంచి వచ్చిన 'హనుమాన్' ప్రస్తుతం థియేటర్స్ లో అదరగొడుతూ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో తేజ సజ్జ హీరోగా నటించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడు ఏ థియేటర్లో చూసినా జైశ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో మారుమోగిపోతుంది. సినిమాకి ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం షాక్ అయిపోతున్నాయి. సౌత్, నార్త్, ఓవర్సీస్.. అనే తేడా లేకుండా ప్రతి చోట హనుమాన్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.


సినిమా విడుదలై 10 రోజులవుతున్నా కలెక్షన్స్ లో కొంచెం కూడా డ్రాప్ లేదంటే హనుమాన్ ఊచకోత ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ.200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే సినిమా చూసిన వాళ్లంతా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ టాలెంట్‌కు ఫిదా అయిపోయారు. తక్కువ బడ్జెట్ లో ఇంత బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. కేవలం రెండు సినిమాల ఎక్స్పీరియన్స్ కే ఇంత మంచి అవుట్ పుట్ ని అతని నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. దాంతో ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రశాంత్ వర్మ పేరు మార్మోగిపోతుంది. ఇక రిలీజ్‌కు ముందు తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ప్రశాంత్ వర్మ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.


చాలామంది దుర్భషలాడారు.. 


"హనుమాన్ రిలీజ్ కి ముందు నా లైఫ్ లో ఎప్పుడూ ఫేస్ చేయని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. చాలామంది నా గురించి దుర్భాషలో మాట్లాడడం కూడా చూశాను. చాలా ఫీల్ అయ్యే వాడిని. అప్పుడు సినిమా రిలీజ్ తర్వాత చూసిన వాళ్లంతా అనవసరంగా అన్నామని చెప్పి.. వాళ్ళకి సిగ్గు అనిపించాలి అని అనుకున్నాను. అందుకే నేను కూడా ఆ మాటలను సీరియస్‌గా తీసుకోకుండా వదిలేశాను. రిలీజ్‌కు ఓ రెండు నెలల ముందు మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. ఇక ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అన్ని సెటిలైపోయి మేము హ్యాపీగా ఉన్నాం" అని అన్నారు.


రాకేష్ మాస్టర్ బ్రతికి ఉంటే బాగుండేది 


"సినిమాలో రాకేష్ మాస్టర్ క్యారెక్టర్ చాలా సర్ప్రైజ్ గా ఉంటుంది. ఆ క్యారెక్టర్ కి ఎవరైతే సూట్ అవుతారని చూస్తున్నాం. ఇదివరకైతే అలాంటి క్యారెక్టర్స్‌కు ఇదివరకు వేణుమాధవ్ ఉండేవారు. ఇప్పుడు అలాంటి ఆర్టిస్టులు దొరక్క గెటప్ శ్రీను సజెస్ట్ చేస్తే రాకేష్ మాస్టర్‌ను తీసుకొని ఆడిషన్ చేశాం. మల్టిపుల్ లుక్ టెస్టులు చేశాం. ఆయన కూడా చాలా ఎఫర్ట్ పెట్టారు. నిజంగా ఆయన ఇప్పుడు ఉండి ఉంటే బాగుండేదనిపించింది. ఎందుకంటే ‘హనుమాన్’ ఆయనకి కూడా మంచి బ్రేక్ ఇచ్చేది" అని తెలిపారు. 


ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన మొదటి సినిమా 'హనుమాన్'. ఈ యూనివర్స్ లో మొత్తం 12 సినిమాలు రాబోతున్నాయి. హనుమాన్ తర్వాత రాబోతున్న 'జై హనుమాన్'పై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. 2025 సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.


Also Read : మహేష్ బాబు జర్మనీకి ఎందుకు వెళ్లారంటే? ఇదీ అసలు విషయం!