YSR Aasara Scheme Money Released: అనంతపురం: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఉరవకొండలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని డ్వాక్రా సంఘాల మహిళల ఖాతాల్లో నగదు జమ చేశారు. అయితే సీఎం జగన్ (AP CM YS Jagan) ఇచ్చింది ఆసరా కాదని టోకరా అని, ఇచ్చేది గోరంత అయితే, దోచేది కొండంత అంటూ టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత సెటైర్లు వేశారు. మహిళల తాళిబొట్లు తెంచిన ఘనుడు జగన్ రెడ్డి అంటూ Paritala Sunitha మండిపడ్డారు. టీడీపీ హయాంలో జరిగిన దాని కన్నా తక్కువ లబ్ధి చేకూర్చినా ప్రచారం మాత్రం గొప్పగా చేసుకుంటున్నారని ఏపీ సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. పిన్నమ్మకు, చెల్లెలికి న్యాయం చేయలేని జగన్ మహిళల్ని ఉద్ధరించానని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.       
డ్వాక్రా రుణమాఫీ, పసుపు కుంకుమ ద్వారా చంద్రబాబు హయాంలో కోటిమంది మహిళలు రూ. 20 వేల మేర లబ్ధిపొందారని పరిటాల సునీత అన్నారు. జగన్ రెడ్డి పాలనలో ఒక్కొక్క మహిళ పొందిన లబ్ధి రూ. 15 వేలకు తగ్గిపోయింది. ఈ రకంగా 50 లక్షలమంది డ్వాక్రా మహిళలకు జగన్ రెడ్డి టోకరా వేసినట్లే అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కోటీ 14 లక్షలమంది డ్వాక్రా మహిళలుంటే 79 లక్షలకే కుదించి.. 35 లక్షలమందికి మొండిచేయి చూపారని పేర్కొన్నారు.


మద్యం రేట్లు మూడు రెట్లు పెంచడంతో పాటు రూ. 2 లక్షల విలువ గల నాసిరకం మద్యం అమ్మారని చెప్పారు. నాసిరకం మద్యంతో 35 లక్షలమంది ఆరోగ్యాలు నాశనం చేశాడని.. అందులో 30 వేల మంది అకాలమృత్యువాత పడ్డారని ఆరోపించారు. నాసిరకం మద్యం ద్వారా మహిళల మాంగల్యాలు మంటగలుపుతున్న సీఎంగా జగన్ ఘనత సాధించాడన్నారు. బాబాయ్ వివేకా హత్యతో పిన్నమ్మ తాళి తెంచిన నరహంతకుల్ని రక్షిస్తున్న సీఎం జగన్ మహిళా ద్రోహి కాదా? చెల్లికి ఆస్తిలో భాగం ఇవ్వని జగన్ మహిళాద్రోహి కాదా అని ప్రశ్నించారు.


ఒక్కో కుటుంబంపై 57 నెలల పాలనలో రూ. 3 లక్షల భారం మోపారు. టీడీపీ హయాంలో సున్నా వడ్డీ రూ.5 లక్షలకు వర్తింపజేస్తే, దాన్ని జగన్ రూ. 3 లక్షలకు కోత కోసి మోసం చేశారన్నారు. ఆ రూ. 3 లక్షలకు కూడా సున్నా వడ్డీ కేంద్రమే భరిస్తోందన్నారు. ఉచిత ఇళ్లు అంటూ ఒక్కో మహిళ నుంచి రూ. 10 వేల నుంచి రూ. 30 వేలు బలవంతంగా వసూలు చేశాడని ఆరోపించారు. టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వలేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఉంటే మొదటి ఏడాది నుంచే 3 వేల ఇళ్లు ఇచ్చి ఉండేవారని.. వాయిదాల వల్ల ఒక్కో అవ్వాతాత రూ. 30 వేలు నష్టపోయారని పేర్కొన్నారు. 


జగన్ పెంచింది కేవలం రూ. 1000.. 
అంగన్వాడీల జీతాలు చంద్రబాబు రూ. 6,300 పెంచితే.. జగన్ పెంచింది కేవలం రూ. 1000 మాత్రమేనని పరిటాల సునీత తెలిపారు. 2014 ఏప్రిల్ 1 నాటికి డ్వాక్రా సంఘాల ఎన్.పి.ఏలు 10.33 శాతం (SLBC -182) ఉండగా 2019 ఏప్రిల్ 1 నాటికి 1.56 శాతానికి తగ్గించామన్నారు. కానీ జగన్ 18 శాతం అని దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 
జగన్ హయాంలో మహిళలపై 2 లక్షల నేరాలు
‘NCRB ప్రకారం ఒక్క 2022లోనే మహిళలపై 25,503 నేరాలు జరిగాయి. 601 అత్యాచారాలు,180 అత్యాచార యత్నం ఘటనలు వెలుగుచూశాయి. జాతీయ స్థాయిలో మహిళలపై నేరాల రేటు 66.4% కాగా, ఏపీలో మాత్రం 96.2% గా ఉంది. వైసీపీ పాలనలో 30,196 మంది మహిళలు, చిన్నారులు మిస్సయ్యారు. 2019తో పోలిస్తే 2021 మహిళల అదృశ్యం ఘటనలు 43.45 %, చిన్నారుల మిస్సింగ్ ఘటనలు 53.61% పెరిగాయి. జగన్ హయాంలో మహిళలపై 2 లక్షలకు పైగా నేరాలు నమోదయ్యాయి. దిశా చట్టం ప్రచారార్భాటానికే పరిమితమైంది. 


జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే లెక్కల ప్రకారం రాష్ట్రంలో 15 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న 12.6% బాలికలు గర్భం దాల్చుతున్నారు. ఈ దారుణాల్లో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో ఉంది. ఇండియా టుడే సర్వే ప్రకారం ఏపీలో 1,33,447మంది వ్యభిచారకూపంలో చిక్కుకున్నారు. ఇందులోనూ ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉన్నా.. మహిళలను బాగు చేశాను, మహిళలను ఉద్దరించాను అని జగన్ చెప్పుకోవడం మోసకారితనమే’ అని ఏపీ సీఎంపై పరిటాల సునీత మండిపడ్డారు.